
బోర్డు పాత్ర ఏమీ లేదు
రోహిత్ రిటైర్మెంట్‌పై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వివరణ
న్యూఢిల్లీ: భారత విజయవంతమైన కెప్టెన్, ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ రిటైర్మెంట్ నిర్ణయం పూర్తిగా అతని వ్యక్తిగతమని బోర్డు సీనియర్ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. వచ్చే నెలలో ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల ద్వైపాక్షిక సిరీస్‌కు ముందు రోహిత్ బుధవారం అనూహ్యంగా సంద్రదాయ టెస్టు ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇది భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో పాటు క్రికెట్ అభిమానుల్ని నిర్ఘాంతపరిచింది. సీనియర్ క్రికెటర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ సారథి రహానే సైతం రోహిత్ నిర్ణయం షాక్‌కు గురి చేసిందని వ్యాఖ్యానించాడు.
‘హిట్‌మ్యాన్’ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంపై శుక్లా స్పందించారు. ‘అది పూర్తిగా అతని వ్యక్తిగత నిర్ణయం. ఇందులో బోర్డు పాత్ర ఏమీ లేదు. బోర్డు పాలసీ ప్రకారం ఎవరైనా ఆటగాడు ఆటకు వీడ్కోలు పలికితే... ఆ నిర్ణయం సవరించుకునేలా ఒత్తిడి చేయం. అలాగే ఎలాంటి సూచన గానీ, సంప్రదింపులు గానీ జరపం’ అని అన్నారు. అయితే సుదీర్ఘ కాలం ఆటగాడిగా, సారథిగా భారత క్రికెట్ అతను అందించిన సేవల్ని కొనియాడుతామన్నారు. ‘రోహిత్ ముమ్మాటికీ గొప్ప బ్యాటర్.
అతను వన్డే క్రికెట్‌లో కొనసాగుతానని చెప్పడం ఇందులో సానుకూలాంశం.కాబట్టి అతని విశేషానుభవం, అసాధారణ ప్రదర్శన భారత వన్డే జట్టుకు బాగా ఉపయోగపడుతుంది’ అని శుక్లా అన్నారు. టెస్టుల్లో టీమిండియా తదుపరి సారథి ఎవరనేదానిపై సీనియర్ పేసర్ బుమ్రా సహా, బ్యాటర్లు కేఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్‌ల పేర్లు వినిపిస్తున్నప్పటికీ శుక్లా వీటిని కొట్టిపారేశారు. రోహిత్ వారసుడి ఎంపిక సెలక్షన్ కమిటీ చూసుకుంటుందని స్పష్టం చేశారు.