
హార్దిక్- ఆశిష్ (Photo Courtesy: BCCI)
ఓటమి బాధలో ఉన్న ముంబై ఇండియన్స్‌కు మరో భారీ షాక్ తగిలింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya)తో పాటు జట్టు మొత్తానికి జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ పాలక మండలి ప్రకటన విడుదల చేసింది. ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా ముంబై మంగళవారం గుజరాత్ టైటాన్స్ (MI Vs GT)తో తలపడింది.
ప్లే ఆఫ్స్ రేసులో సాఫీగా ముందుకు సాగాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్లో ముంబై బ్యాటర్లు తేలిపోయారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 155 పరుగులకు హార్దిక్ సేన పరిమితమైంది.
గెలిచిన గుజరాత్
ఇక గుజరాత్ లక్ష్య ఛేదనకు దిగగా పదే పదే వర్షం అంతరాయం కలిగించింది. అయితే, ఎట్టకేలకు అర్ధరాత్రి తర్వాత వాన తెరిపినవ్వడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 19 ఓవర్లలో 147 పరుగులు చేయాల్సి ఉండగా.. గుజరాత్ పని పూర్తి చేసింది. ముంబైపై మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది.
కాగా ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో బౌలింగ్ కోటా పూర్తి చేయలేకపోయింది. దీంతో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI).. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు భారీ జరిమానా విధించింది.
రూ. 24 లక్షల ఫైన్
ఈ సీజన్‌లో రెండోసారి ఇదే తప్పిదాన్ని పునరావృతం చేసినందుకు హార్దిక్‌కు రూ. 24 లక్షల ఫైన్ వేసింది. అదే విధంగా.. నిబంధనల ప్రకారం.. ఇంపాక్ల్ ప్లేయర్ సహా తుదిజట్టులోని ఆటగాళ్ల అందరికి రూ. 6 లక్షల జరిమానా లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తున్నట్లు తెలిపింది. ఈ రెండింటిలో ఏది తక్కువగా ఉంటే అది జరిమానాగా వర్తిస్తుందని వెల్లడించింది.
మరోవైపు గుజరాత్ టైటాన్స్ హెడ్‌కోచ్ ఆశిష్ నెహ్రాకు కూడా ఎదురుదెబ్బ తగిలింది. అతడికి కూడా జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ పాలక మండలి తెలిపింది.
ఆశిష్ నెహ్రాను వదల్లేదు
ఈ మేరకు.. ‘‘ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ గుజరాత్ టైటాన్స్ హెడ్‌కోచ్ ఆశిష్ నెహ్రా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తున్నాం. అదే విధంగా అతడి ఖాతాలో ఓ డిమెరిట్ పాయింట్ జత చేస్తున్నాం’’ అని ఐపీఎల్ పాలక మండలి తమ ప్రకటనలో పేర్కొంది.
ఐపీఎల్ నియమావళిలోని ఆర్టికల్ 2.20 ప్రకారం ఆశిష్ నెహ్రా లెవల్ 1 తప్పిదానికి పాల్పడ్డాడని.. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించినందుకు ఈ మేర చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. నెహ్రా కూడా తన తప్పును అంగీకరించాడని పేర్కొంది.
అయితే, నెహ్రా ఏం తప్పు చేశాడన్న విషయంపై మాత్రం స్పష్టతనివ్వలేదు. కాగా వర్షం వల్ల పదే పదే మ్యాచ్ టైమింగ్‌ను మార్చడంపై మైదానంలోనే నెహ్రా అంపైర్లతో వాదనకు దిగాడు. అందుకే అతడికి జరిమానా వేసినట్లు తెలుస్తోంది.
ఐపీఎల్-2025: ముంబై వర్సెస్ గుజరాత్
👉వేదిక: వాంఖడే, ముంబై
👉టాస్: గుజరాత్.. తొలుత బౌలింగ్
👉ముంబై స్కోరు: 155/8 (20)
👉గుజరాత్ స్కోరు: 147/7 (19)
👉ఫలితం: డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం ముంబైపై మూడు వికెట్ల తేడాతో గుజరాత్ గెలుపు
చదవండి: టీ20 క్రికెట్లో అది నేరం లాంటిదే!.. ఏదేమైనా క్రెడిట్ మా బౌలర్లకే: ఓటమిపై హార్దిక్
Rain delays, wickets falling, and nerves running high 📈...@gujarat_titans edge past everything to seal a thrilling win over #MI that had fans on the edge of their seats! 🥳
Scorecard ▶ https://t.co/DdKG6Zn78k #TATAIPL | #MIvGT pic.twitter.com/NLYj3ZlI3w— IndianPremierLeague (@IPL) May 6, 2025