వర్షమా?.. ఎక్కడ?: ఆశిష్‌ నెహ్రా, రాహుల్‌ తెవాటియా ఆగ్రహం | MI vs GT: Ashish Nehra Rahul Tewatia Furious With Umpires Reason Is | Sakshi
Sakshi News home page

వర్షమా?.. ఎక్కడ?: ఆశిష్‌ నెహ్రా, రాహుల్‌ తెవాటియా ఆగ్రహం

May 7 2025 11:14 AM | Updated on May 7 2025 1:04 PM

MI vs GT: Ashish Nehra Rahul Tewatia Furious With Umpires Reason Is

Photo Courtesy: BCCI/JioHotstar

ఐపీఎల్‌-2025 (IPL 2025)లో గుజరాత్‌ టైటాన్స్‌ ప్లే ఆఫ్స్‌ రేసులో మరో ముందడుగు వేసింది. ముంబై ఇండియన్స్‌ (MI vs GT)తో మంగళవారం నాటి మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో గెలిచి.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకువచ్చింది. అయితే, ఈ గెలుపు గుజరాత్‌కు అంత సులువుగా ఏమీ దక్కలేదు.

వర్షం కారణంగా పదే పదే వాయిదా పడిన మ్యాచ్‌ ఎట్టకేలకు పూర్తి కావడంతో గిల్‌ సేనకు ఊరట దక్కింది. ఒకవేళ వాన వల్ల మ్యాచ్‌ రద్దయిపోతే ఇరు జట్లకు చెరో పాయింట్‌ వచ్చేది. అప్పుడు గుజరాత్‌ ప్లే ఆఫ్స్‌ అవకాశాలు కాస్త క్లిష్టంగా మారేవి. మరోవైపు.. బ్యాటింగ్‌ పరంగా విఫలమైన ముంబై పాలిట వర్షం వరంగా మారేది.

 టైమింగ్‌ను  మార్చడంతో
అందుకే, మధ్యలో వాన తెరిపినిచ్చినా మ్యాచ్‌ టైమింగ్‌ను పదే పదే మార్చడంపై గుజరాత్‌ టైటాన్స్‌ హెడ్‌కోచ్‌ ఆశిష్‌ నెహ్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అనేక అవాంతరాల అనంతరం.. అర్ధరాత్రి దాటిన తర్వాత 12:09 AM నుంచి మ్యాచ్‌ను 12:25 AMకు మార్చిన అంపైర్లు.. ఆ తర్వాత మ్యాచ్‌ పునఃప్రారంభాన్ని 12:30 AMకు వాయిదా వేశారు.

వర్షమా?.. ఎక్కడ?
ఈ నేపథ్యంలో మైదానంలోకి వచ్చిన ఆశిష్‌ నెహ్రా అంపైర్లతో వాదనకు దిగినట్లు కనిపించింది. మరోవైపు.. టైటాన్స్‌ బ్యాటర్‌ రాహుల్‌ తెవాటియా కూడా.. ‘‘వర్షం ఎక్కడ పడుతోంది’’ అన్నట్లుగా అంపైర్లతో వాదించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. కీలకమైన మ్యాచ్‌లో గెలుపునకు దగ్గరైన వేళ వరుణుడితో పాటు అంపైర్లు కూడా తమతో దోబూచులాడటం నచ్చకే వీళ్లిద్దరూ ఇలా ఫైర్‌ అయ్యారంటూ అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

రాణించిన గుజరాత్‌ బౌలర్లు
కాగా ముంబైలోని వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన గుజరాత్‌ తొలుత బౌలింగ్‌ చేసింది. బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ముంబైని 155 పరుగులకు కట్టడి చేయగలిగింది. సాయి కిషోర్‌ రెండు వికెట్లు తీయగా.. సిరాజ్‌, అర్షద్‌ ఖాన్‌, రషీద్‌ ఖాన్‌, గెరాల్డ్‌ కోయెట్జి ఒక్కో వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు.

ఇక ముంబై బ్యాటర్లలో ఓపెనర్లు రియాన్‌ రికెల్టన్‌ (2), రోహిత్‌ శర్మ (7) పూర్తిగా విఫలమయ్యారు. ఇలాంటి దశలో వన్‌డౌన్‌ బ్యాటర్‌ విల్‌జాక్స్‌ (53), సూర్యకుమార్‌ యాదవ్‌ (35) కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దారు. ఆఖర్లో కార్బిన్‌ బాష్‌ (27) కూడా రాణించడంతో ముంబై ఎనిమిది వికెట్లు నష్టపోయి 155 పరుగులు చేసింది.

డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం
ఇక లక్ష్య ఛేదనలో టైటాన్స్‌కు పదే పదే వర్షం ఆటంకం కలిగించింది. అయితే, కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (43), వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌ (30), షెర్ఫానే రూథర్‌ఫర్డ్‌ (28) రాణించారు. అయితే, ఆఖర్లో వర్షం వల్ల డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం 19 ఓవర్లలో గుజరాత్‌ లక్ష్యాన్ని 147గా నిర్ణయించారు.

ఈ క్రమంలో ఆఖరి ఓవర్లో అనేక నాటకీయ పరిణామాల నడుమ గుజరాత్‌ 19 ఓవర్లలో  ఏడు వికెట్ల నష్టానికి సరిగ్గా 147 పరుగులు చేసి జయభేరి మోగించింది. చివరి ఓవర్లో ముంబై పేసర్‌ దీపక్‌ చహర్‌ బౌలింగ్‌లో (4,1, 6, N1, 1, W, 1) తెవాటియా కొట్టిన ఫోర్‌, కోయెట్జి బాదిన సిక్సర్‌ గుజరాత్‌ను విజయతీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాయి.

ఇక ఈ సీజన్‌లో ఇప్పటికి పదకొండు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న గుజరాత్‌కు ఇది ఎనిమిదో విజయం. ఫలితంగా గిల్‌ సేన ఖాతాలో ఇప్పుడు 16 పాయింట్లు ఉన్నాయి. నెట్‌ రన్‌రేటు (0.793) పరంగానూ మెరుగ్గా ఉండటంతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి దూసుకువచ్చింది.

చదవండి: టీ20 క్రికెట్లో అది నేరం లాంటిదే!.. ఏదేమైనా క్రెడిట్‌ మా బౌలర్లకే: ఓటమిపై హార్దిక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement