టీ20 ప్రపంచకప్-2026లో భారత్‌లో మ్యాచ్‌లు ఆడే విషయంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) తన పట్టు వీడటం లేదు. మంగళవారం ఐసీసీతో జరిగిన సమావేశంలోనూ టోర్నమెంట్ కోసం భారత్‌కు వెళ్లకూడదని తమ నిర్ణయాన్ని బీసీబీ పునరుద్ఘాటించింది.
భద్రతా కారణాలను సాకుగా చూపుతూ తమ జట్టును భారత్‌కు పంపబోమని, తమ మ్యాచ్‌లను శ్రీలంక లేదా మరేదైనా ఇతర వేదికకు మార్చాలని మరోసారి బీసీబీ డిమాండ్ చేసింది. అయితే షెడ్యూల్ ఇప్పటికే ఖరారు కావగడంతో ఆఖరి నిమిషంలో వేదికలను మార్చడం అసాధ్యమని, బీసీబీ తన వైఖరి పునఃపరిశీలించుకోవాలని ఐసీసీ విజ్ఞప్తి చేసింది. కానీ బంగ్లా క్రికెట్ బోర్డు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆఖరి నిమిషం వరకు తమ చర్చలు జరుపుతామని, ఆటగాళ్లు భద్రత తమకు ముఖ్యమని బీసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది.
కాగా భారత్-బంగ్లాదేశ్ మధ్య గత కొంత కాలంగా దౌత్యపరమైన ఉద్రిక్తలు నెలకొన్నాయి. అయితే బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను ఐపీఎల్ నుంచి రిలీజ్ చేయడంతో మరింత పెరిగాయి. ఐపీఎల్-2026 వేలంలో ముస్తాఫిజుర్‌ను రూ.9.20 కోట్ల భారీ ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది.
అయితే బంగ్లాలో హిందువులపై దాడులు రోజు రోజుకు పెరిగిపోతుండడంతో ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ నుంచి తప్పించాలని చాలామంది డిమాండ్ చేశారు. దీంతో అతడిని జట్టు నుంచి రిలీజ్ చేయాలని కేకేఆర్‌ను బీసీసీఐ ఆదేశించింది. దీంతో అతడిని కేకేఆర్ విడుదల చేసింది.
ఈ క్రమంలో తమ జట్టు ఆటగాడిని రిలీజ్ చేయడాన్ని బంగ్లా క్రికెట్ బోర్డు ఘోర అవమానంగా భావించింది. దీంతో వరల్డ్‌కప్ మ్యాచ్‌లను ఆడేందుకు భారత్‌కు తమ జట్టును పంపబోమని, వేదికలను మార్చాలని ఐసీసీని బీసీబీ డిమాండ్ చేసుకుంది. అంతేకాకుండా ఐపీఎల్ ప్రసారాలను తమ దేశంలో బంగ్లాదేశ్ బ్యాన్ చేసింది. ఒకవేళ బంగ్లాదేశ్ భారత్‌లో ఆడేందుకు నిరాకరిస్తే, టోర్నమెంట్ రూల్స్ ప్రకారం వారు పాయింట్లు కోల్పోయే అవకాశం ఉంది
చదవండి: IND vs NZ: భారత జట్టులోకి అనూహ్య ఎంట్రీ.. బదోని ఎంపికకు గల కారణాలివే?


