
తాజాగా (సెప్టెంబర్ 17) భారత మహిళల జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్‌లో (మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో వన్డే) చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా మహిళా జట్టుకు మరో షాక్ తగిలింది. పుండు మీద కారం చల్లినట్లుగా ఆ జట్టు మ్యాచ్ ఫీజ్‌లో 10 శాతం కోత విధించబడింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆసీస్ జట్టు మొత్తానికి ఈ ఫైన్ వర్తిస్తుంది. ఆ మ్యాచ్‌లో ఆసీస్ బౌలర్లు నిర్దేశిత సమయంలోపు 2 ఓవర్లు వెనుకపడి ఉన్నారు.
ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లో ఆర్టికల్ 2.22 నిబంధన ప్రకారం నిర్దేశిత సమయంలోగా వెనుకపడిన ప్రతి ఓవర్‌కు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజ్‌లో 5 శాతం కోత విధిస్తారు. ఈ లెక్కన ఆసీస్ ప్లేయర్లకు రెండు ఓవర్లకు గానూ 10 శాతం జరిమానాగా విధించారు.
మ్యాచ్ విషయానికొస్తే.. భారత్ ఆస్ట్రేలియాపై 102 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 49.5 ఓవర్లలో 292 పరుగులు చేసి ఆలౌటైంది. ఓపెనర్ స్మృతి మంధన (91 బంతుల్లో 117; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడింది.
అనంతరం 293 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. క్రాంతి గౌడ్ (9.5-1-28-3), దీప్తి శర్మ (6-0-24-2), రేణుకా సింగ్ ఠాకూర్ (6.3-0-28-1), స్నేహ్ రాణా (6-0-35-1), అరుంధతి రెడ్డి (7.3-0-46-1), రాధా యాదవ్ (5-0-27-1) ధాటికి 40.5 ఓవర్లలో 190 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో సదర్‌ల్యాండ్ (45), ఎల్లిస్ పెర్రీ (44) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.
ఈ గెలుపుతో భారత్ సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. నిర్ణయాత్మక మూడో వన్డే న్యూఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 20న జరుగనుంది.