ODI: ఆసీస్‌ బ్యాటర్ల విధ్వంసం.. 6.5 ఓవర్లలోనే ఖేల్‌ ఖతం | AUS Vs WI 3rd ODI: Australia Chase West Indies Target Just In Series Clean Sweep, Score Details Inside - Sakshi
Sakshi News home page

విండీస్‌పై ఆసీస్‌ బ్యాటర్ల విధ్వంసం.. 6.5 ఓవర్లలోనే వన్డే ఖేల్‌ ఖతం

Feb 6 2024 1:27 PM | Updated on Feb 6 2024 3:01 PM

Aus Vs WI 3rd ODI: Australia Chase West Indies Target Just In Series Clean Sweep - Sakshi

జేక్‌ ఫ్రాసెర్‌ మెక్‌గర్క్‌ పరుగుల సునామీ (PC: Fox Cricket X)

వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా బ్యాటర్లు ప్రతాపం చూపించారు. మూడో వన్డేలో కేవలం 6.5 ఓవర్లలోనే విండీస్‌ విధించిన లక్ష్యాన్ని ఛేదించి సత్తా చాటారు. కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు వెస్టిండీస్‌ ఆసీస్‌ పర్యటనకు వెళ్లింది.

ఇందులో భాగంగా టెస్టు సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకున్న కరేబియన్‌ జట్టు.. వన్డేల్లో మాత్రం కంగారూల చేతిలో చిత్తుగా ఓడింది. తొలి రెండు వన్డేల్లో వరుసగా 8 వికెట్లు.. 81 పరుగులతో పరాజయం పాలైన షాయీ హోప్‌ బృందం.. తాజాగా ఆఖరి మ్యాచ్‌లోనూ ఓడి వైట్‌వాష్‌కు గురైంది.

కాన్‌బెర్రా వేదికగా మనుకా ఓవల్‌ మైదానంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పర్యాటక విండీస్‌ కేవలం 86 పరుగులకే ఆలౌట్‌​ అయింది.

యువ పేసర్‌ జేవియర్‌ బ్రాట్‌లెట్‌ మరోసారి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని ఏకంగా నాలుగు వికెట్లు తీయగా.. లాన్స్‌ మోరిస్‌, ఆడం జంపా రెండేసి వికెట్లు పడగొట్టారు. సీన్‌ అబాట్‌కు ఒక వికెట్‌ దక్కింది.

ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య ఆసీస్‌కు ఓపెనర్లు జేక్‌ ఫ్రాసెర్‌ మెక్‌గర్క్‌, జోష్‌ ఇంగ్లిస్‌ అదిరిపోయే ఆరంభం అందించారు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ విండీస్‌ బౌలింగ్‌లో పరుగుల విధ్వంసం సృష్టించారు.

జేక్‌ 18 బంతుల్లోనే ఐదు ఫోర్లు, మూడు సిక్స్‌లతో 41 రన్స్‌ చేయగా.. ఇంగ్లిస్‌ 16 బంతుల్లో 35 పరుగులు(నాటౌట్‌) సాధించాడు. ఇక జేక్‌ జోరుకు అల్జారీ జోసెఫ్‌ బ్రేకులు వేయగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఆరోన్‌ హార్డీ(2)ని ఒషానే థామస్‌ పెవిలియన్‌కు పంపాడు.

ఈ క్రమంలో ఇంగ్లిస్‌కు జతైన కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌(6- నాటౌట్‌) గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ నేపథ్యంలో 6.5 ఓవర్లలోనే 87 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి.. 8 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఇక ఆసీస్‌ బౌలర్‌ జేవియర్‌ బార్ట్‌లెట్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు కూడా అందుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement