Aus Vs Pak: వార్నర్‌ ఫేర్‌వెల్‌ టెస్టు.. ఆస్ట్రేలియా తుది జట్టు ప్రకటన | Aus Vs Pak 3rd Test: Australia Announce Unchanged Playing XI For Warner Farewell Test At Sydney - Sakshi
Sakshi News home page

Aus Vs Pak 3rd Test: వార్నర్‌ ఫేర్‌వెల్‌ టెస్టు.. ఆస్ట్రేలియా తుది జట్టు ప్రకటన

Published Tue, Jan 2 2024 11:12 AM

Aus Vs Pak 3rd Test Australia Announce Playing XI Warner Farewell Test - Sakshi

Australia vs Pakistan, 3rd Test: సొంతగడ్డపై పాకిస్తాన్‌తో మూడో టెస్టుకు ఆస్ట్రేలియా తుదిజట్టును ప్రకటించింది. తొలి రెండు మ్యాచ్‌లలో ఆడిన జట్టుతోనే ఆఖరి టెస్టులో బరిలోకి దిగనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని ఆసీస్‌ సారథి ప్యాట్‌ కమిన్స్‌ మంగళవారం ధ్రువీకరించాడు.

స్వదేశంలో పాకిస్తాన్‌పై టెస్టుల్లో రెండు దశాబ్దాలకు పైగా ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూ ఆసీస్‌ మరోసారి సిరీస్‌ గెలిచిన విషయం తెలిసిందే. పెర్త్‌ టెస్టులో పర్యాటక పాక్‌ను 360 పరుగుల తేడాతో చిత్తు చేసిన కంగారూ జట్టు.. బాక్సింగ్‌ డే టెస్టులోనూ విజయం సాధించింది. తద్వారా మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ కైవసం చేసుకుంది.

వార్నర్‌ ఫేర్‌వెల్‌ టెస్టు
ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో టెస్టు జరుగనుంది. ప్రఖ్యాత సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో బుధవారం (జనవరి 3) నుంచి ఐదు రోజుల మ్యాచ్‌ మొదలు కానుంది. ఆసీస్‌ దిగ్గజ బౌలర్‌ గ్లెన్‌ మెగ్రాత్‌ సతీమణి జ్ఞాప​కార్థం పింక్‌ టెస్టుగా నిర్వహించనున్న ఈ మ్యాచ్‌ సందర్భంగా వెటరన్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ తన కెరీర్లో ఆఖరి టెస్టు ఆడనున్నాడు.

తన రెగ్యులర్‌ జోడీ ఉస్మాన్‌ ఖవాజాతో కలిసి ఓపెనింగ్‌ చేయనున్నాడు. మార్నస్‌ లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్‌, ట్రవిస్‌ హెడ్‌ తమ స్థానాలు నిలబెట్టుకోగా.. నెట్స్‌లో శ్రమిస్తున్న ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గ్రీన్‌ మరోసారి బెంచ్‌కే పరిమితం కానున్నాడు. మరో ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్న కారణంగా గ్రీన్‌ను పక్కనపెట్టక తప్పలేదు.
 

‘పింక్‌’ టెస్టులో గెలుపు ఎవరిది?
ఇక బౌలింగ్‌ దళంలో పేస్‌ త్రయం ప్యాట్‌ కమిన్స్, మిచెల్‌ స్టార్క్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌తో పాటు స్పిన్నర్‌ నాథన్‌ లియోన్‌ ఉండగా.. అలెక్స్‌ క్యారీ వికెట్‌ కీపర్‌గా కొనసాగనున్నాడు. కాగా ఆస్ట్రేలియా దిగ్గజ ఫాస్ట్‌బౌలర్‌ గ్లెన్‌ మెగ్రాత్‌ భార్య జేన్‌ మెగ్రాత్‌ రొమ్ము క్యాన్సర్‌తో మరణించింది.

ఈ నేపథ్యంలో.. క్యాన్సర్‌ బాధితులకు అండగా నిలిచేందుకు వీలుగా.. సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ఆమె జ్ఞాపకార్థం మెగ్రాత్‌ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశాడు. ఇందులో భాగంగా ప్రతి ఏడాది ఆసీస్‌ ఆడే టెస్టుల్లో ఒక మ్యాచ్‌ను పింక్‌ టెస్టుగా నిర్వహిస్తూ ఫండ్‌రైజింగ్‌ చేస్తున్నారు. కాగా ఇప్పటికే సిరీస్‌ కోల్పోయిన పాకిస్తాన్‌ ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది.

పాకిస్తాన్‌తో మూడో టెస్టుకు ఆస్ట్రేలియా తుదిజట్టు:
డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), నాథన్ లియోన్, జోష్ హాజిల్‌వుడ్‌.

చదవండి: Aus Vs Pak: నా రికార్డు బ్రేక్‌ చేసే సత్తా అతడికే ఉంది: ఆసీస్‌ దిగ్గజ బౌలర్‌

Advertisement
 
Advertisement