
న్యూఢిల్లీ: ఆసియా కప్ అండర్–17 ఫుట్‌బాల్ క్వాలిఫయర్స్ టోర్నీకి భారత్ కూడా ఓ వేదికైంది. ఆసియా కప్–2026 కోసం నిర్వహించే క్వాలిఫయర్స్‌కు ఏడు దేశాలు ఆతిథ్యమివ్వనున్నాయి. ఇందులో భారత్ కూడా ఉంది. భారత్‌కు సంబంధించిన పోటీలను ఈ నవంబర్ 22 నుంచి 30 వరకు అహ్మదాబాద్‌లో నిర్వహించనున్నట్లు తెలిసింది. పాల్గొనే మొత్తం 38 దేశాల జట్లను ఏడు గ్రూప్‌లుగా విభజిస్తారు. మూడు గ్రూప్‌ల్లో ఆరేసి జట్లు, నాలుగు గ్రూప్‌ల్లో ఏడేసి జట్లు ఉంటాయి. దీనికి సంబంధించిన ‘డ్రా’ను రేపు తీయనున్నారు.
ఈ ఏడు గ్రూప్‌ల విజేత జట్లు సౌదీ అరేబియాలో వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్‌కు నేరుగా అర్హత సాధిస్తాయి. ఇంతకుముందే 9 జట్లకు డైరెక్ట్ ఎంట్రీ లభించింది. ఈ ఏడాది ఖతర్‌లో జరిగిన అండర్–17 ప్రపంచకప్‌లో తలపడటం ద్వారా 9 జట్లకు ఈ అవకాశం లభించింది. ఆసియాకప్ క్వాలిఫయర్స్ టోర్నీలో భారత్ కూడా వేదికవడం పట్ల అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) అధ్యక్షుడు కళ్యాణ్ చౌబే హర్షం వ్యక్తం చేశారు.
అండర్–17 ఫిఫా ప్రపంచకప్ నిర్వహించే సత్తా తమకు ఉందని ఏఎఫ్‌సీ క్వాలిఫయర్స్ ద్వారా నిరూపించుకుంటామని చెప్పారు. అహ్మదాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాలకు తీసిపోని విధంగా తీర్చిదిద్దిన స్టేడియంలో పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.