రోహిత్‌ శర్మ అరుదైన ఘనత.. ధోనికి అలా సాధ్యం కాలేదు! అజారుద్దీన్‌తో పాటు..

Asia Cup: Rohit Sharma Equals Dhoni 2 Elite Captaincy Records Breaks This - Sakshi

Asia Cup, 2023 India vs Sri Lanka, Final- Rohit Sharma Record: ఐదేళ్ల క్రితం ఆసియా కప్‌ టోర్నీలో టీమిండియాను చాంపియన్‌గా నిలిపిన రోహిత్‌ శర్మ.. కెప్టెన్‌గా మరోసారి అదే ఫీట్‌ను పునరావృతం చేశాడు. హిట్‌మ్యాన్‌ సారథ్యంలో భారత జట్టు ఆసియా కప్‌-2023 ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసింది. ఏకంగా 10 వికెట్ల తేడాతో మట్టికరిపించి విజయకేతనం ఎగురవేసింది.

మిస్టర్‌కూల్‌తో పాటు లంక లెజెండ్‌ మాదిరిగానే
వన్డే మ్యాచ్‌లో 50 పరుగులకే ఆలౌట్‌ అయిన శ్రీలంక విధించిన స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా 6.1 ఓవర్లలోనే ఛేదించి రికార్డు స్థాయిలో అతి పెద్ద విజయం నమోదు చేసింది. కాగా ఆటగాడిగా రోహిత్‌ శర్మ కెరీర్‌లో ఇది 250వ అంతర్జాతీయ వన్డే కావడం విశేషం.

అదే విధంగా ఆసియా కప్‌ వన్డే చరిత్రలో 28వది. ఇక ఈ మ్యాచ్‌లోనే కెప్టెన్‌గానూ రోహిత్‌ అరుదైన ఘనతలు సాధించాడు. శ్రీలంకపై విజయంతో ఆసియా వన్డే కప్‌లో సారథిగా తొమ్మిది మ్యాచ్‌లు గెలిచి.. టీమిండియా దిగ్గజ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని, శ్రీలంక లెజెండ్‌ అర్జున రణతుంగతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు.

ధోనికి అలా సాధ్యం కాలేదు
అయితే, ధోని(14 మ్యాచ్‌లలో), రణతుంగ(13 మ్యాచ్‌లలో)ల కంటే అత్యంత వేగంగా ఈ ఫీట్‌ నమోదు చేశాడు.  11 మ్యాచ్‌లలో 9 విజయాలు సాధించి చరిత్రకెక్కాడు. ఇదిలా ఉంటే.. కొలంబోలో శ్రీలంకతో ఆదివారం నాటి ఫైనల్లో గెలుపుతో రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా రెండోసారి ఆసియా కప్ అందుకున్నాడు.

అజారుద్దీన్‌తో పాటు.. ధోని, రోహిత్‌
ఈ క్రమంలో ఒకటి కంటే ఎక్కువసార్లు ఈ ఘనత సాధించిన కెప్టెన్‌గా మహ్మద్‌ అజారుద్దీన్‌, మహేంద్ర సింగ్‌ ధోని తర్వాతి స్థానంలో నిలిచాడు. 1990-91లో అజారుద్దీన్‌, 2010, 2016(టీ20 ఫార్మాట్‌లో తొలిసారి)లో ధోని టీమిండియాకు టైటిల్‌ అందించారు. కాగా ఫైనల్లో ఆరు వికెట్లతో చెలరేగి హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలవగా.. చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు అందుకున్నాడు.

చదవండి: Asia Cup 2023: కాస్త ఓవర్‌ అయిందేమో భయ్యా! అందుకే ఆ బంతి వెంట పరిగెత్తాను: సిరాజ్‌
అతడే మా కొంపముంచాడు.. మమ్మల్ని క్షమించండి ప్లీజ్‌: శ్రీలంక కెప్టెన్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top