Asia Cup 2023: కాస్త ఓవర్‌ అయిందేమో భయ్యా! అందుకే ఆ బంతి వెంట పరిగెత్తాను: సిరాజ్‌

Asia Cup Ind vs SL Siraj: Thinking It Would Be Great If I Could Stop Boundary - Sakshi

 Asia Cup, 2023 India vs Sri Lanka, Final- Mohammed Siraj: ఆ ఆరు వికెట్లు... 
సిరాజ్‌ రెండో ఓవర్‌...  

తొలి బంతి: పాయింట్‌ దిశగా నిసాంక డ్రైవ్‌... జడేజా అద్భుత క్యాచ్‌. 
మూడో బంతి: అవుట్‌ స్వింగర్‌కు సమరవిక్రమ ఎల్బీడబ్ల్యూ. 
నాలుగో బంతి: కవర్‌ పాయింట్‌ దిశగా ఆడిన అసలంక... కిషన్‌ క్యాచ్‌. 
ఆరో బంతి: అవుట్‌ స్వింగర్‌ను ఆడలేక కీపర్‌ రాహుల్‌కు ధనంజయ క్యాచ్‌. 

సిరాజ్‌ మూడో ఓవర్‌... 
నాలుగో బంతి: అవుట్‌ స్వింగర్‌...షనక క్లీన్‌బౌల్డ్‌. 

సిరాజ్‌ ఆరో ఓవర్‌... 
రెండో బంతి: అవుట్‌ స్వింగర్‌... డ్రైవ్‌ చేయబోయి మెండిస్‌ క్లీన్‌బౌల్డ్‌.  

నాకు రాసిపెట్టి ఉందన్న సిరాజ్‌ 
అంతా ఒక కలలా అనిపిస్తోంది. గత కొంతకాలంగా చాలా బాగా బౌలింగ్‌ చేస్తున్నాను. కానీ వికెట్లు మాత్రం దక్కడంలేదు. లైన్‌ అండ్‌  లెంగ్త్‌కు కట్టుబడి బౌలింగ్‌ చేశా. చివరకు ఇవాళ నేను అనుకున్న ఫలితం వచ్చింది. వన్డేల్లో బంతిని స్వింగ్‌ చేసేందుకు సాధారణంగా  ప్రయత్నిస్తుంటా.

టోర్నీ గత మ్యాచ్‌లలో అలాంటిది సాధ్యం కాలేదు. కానీ ఇవాళ మంచి స్వింగ్‌ లభించింది. అవుట్‌ స్వింగర్‌ను సమర్థంగా వాడుకోవడం ఆనందంగా అనిపించింది. బ్యాటర్‌లు డ్రైవ్‌ చేసేందుకు ప్రయత్నిస్తే అవుటయ్యేలా బంతులు వేశా. గతంలో శ్రీలంకతో మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనకు చేరువగా వచ్చినా చివరకు దక్కలేదు.

సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంది
మనకు ఎంత రాసి పెట్టి ఉంటే అంతే దక్కుతుందని నమ్ముతా. ఇవాళ అదృష్టం నా వైపు ఉంది. భారత్‌కు ప్రాతినిధ్యం వహించడంకంటే గర్వించే విషయం మరొకటి ఉండదు. ఇలాంటి ప్రదర్శనలు మరింత ప్రేరణను అందిస్తాయి. కఠోర శ్రమ, సాధన ఫలితమిస్తున్నాయి. నేను ఇంకా సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంది అని టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌  సిరాజ్‌ సంతోషం వ్యక్తం చేశాడు.

బౌండరీ ఆపేందుకు సిరాజ్‌ పరుగులు
ఆసియా కప్‌-2023 ఫైనల్లో శ్రీలంకతో మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో భారత జట్టుకు సిరాజ్‌ విజయం అందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కఠిన శ్రమ వల్లే ఇదంతా సాధ్యమైందంటూ సిరాజ్‌ ఉద్వేగానికి లోనయ్యాడు. ఇక శ్రీలంక ఇన్నింగ్స్‌లో నాలుగో ఓవర్లో అప్పటికే మూడు వికెట్లు తీసిన తర్వాత సిరాజ్‌ హ్యాట్రిక్‌ కోసం యత్నించగా.. బంతి బౌండరీ దిశగా వెళ్లింది.

బాల్‌ను ఆపేందుకు సిరాజ్‌  కూడా దాని వెంట పరుగులు తీశాడు. ఇది చూసి విరాట్‌ కోహ్లి, శుబ్‌మన్‌  గిల్‌ సహా హార్దిక్‌పాండ్యా నవ్వులు చిందించారు.  మ్యాచ్‌ చూస్తున్న వాళ్లకు ఇదంతా కాస్త అసాధారణంగా అనిపించింది. కాస్త ఓవర్‌ అయిందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి.

అత్యుత్సాహం కాదు.. అంకితభావం
నిజానికి అది అత్యుత్సాహం అనడం కంటే ఆట పట్ల సిరాజ్‌ నిబద్ధత, అంకితభావానికి నిదర్శనం అని చెప్పొచ్చు. ఈ విషయం గురించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకుంటున్న సమయంలో రవిశాస్త్రి సిరాజ్‌ను ప్రశ్నించగా.. ‘‘బంతి బౌండరీకి వెళ్లకుండా ఆపితే గొప్పగా ఉంటుందని భావించాను అంతే’’ అని సిరాజ్‌ సమాధానం ఇచ్చాడు. 

గ్రౌండ్స్‌మెన్‌కు సిరాజ్‌ గిఫ్ట్‌ 
ఫైనల్లో అద్భుత బౌలింగ్‌ ప్రదర్శనతో చెలరేగిన సిరాజ్‌ తన పెద్ద మనసును చాటుకున్నాడు. టోర్నీలో ప్రతికూల పరిస్థితుల్లోనూ ఎంతో శ్రమకోర్చి పిచ్‌లు సిద్ధం చేసిన ప్రేమదాస స్టేడియం గ్రౌండ్స్‌మెన్‌ను తన తరఫున కానుకను ప్రకటించాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా తనకు వచ్చిన 5 వేల డాలర్ల చెక్‌ను వారికి అందించాడు.

మరోవైపు ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) కూడా కాండీ, కొలంబో గ్రౌండ్స్‌మెన్‌కు ప్రత్యేక బహుమతిని ప్రకటించింది. 50 వేల డాలర్లు వారికి ఇస్తున్నట్లు ఏసీసీ అధ్యక్షుడు జై షా వెల్లడించారు.

చదవండి: నా శరీరం 40 ఏళ్లు అంటోంది.. ఐడీ 31 చూపిస్తోంది.. కానీ: డికాక్‌ భావోద్వేగం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top