అతడే మా కొంపముంచాడు.. మమ్మల్ని క్షమించండి ప్లీజ్‌: శ్రీలంక కెప్టెన్‌

Really sorry that we disappointed you: Dasun Shanaka - Sakshi

ఆసియాకప్‌-2023 ఫైనల్లో టీమిండియా చేతిలో 10 వికెట్ల తేడాతో శ్రీలంక ఘోర ఓటమిని చవిచూసింది. లీగ్‌,సూపర్‌-4 దశలో అదరగొట్టిన లంకేయులు.. ఫైనల్లో మాత్రం దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్ల ధాటికి లంక బ్యాటింగ్‌ లైనప్‌ పేకమేడలా కూలిపోయింది.భారత పేసర్ మహ్మద్‌ సిరాజ్‌ 6 వికెట్లతో లంక పతనాన్ని శాసించంగా.. హార్దిక్‌ పాండ్యా 3 వికెట్లతో ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు. వీరిద్దరి అద్భుత ప్రదర్శన ఫలితంగా ప్రత్యర్థి లంక కేవలం 50 పరుగులకే కుప్పకూలింది.

అంతర్జాతీయ వన్డేల్లో లంకకు ఇది రెండో అత్యల్ప స్కోర్‌ కావడం గమనార్హం. లంక బ్యాటర్లలో 8 మంది సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌కే పరిమితమయ్యారు. ఇక వరల్డ్‌కప్‌కు ముందు ఈ దారుణ ఓటమి లంక ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మరోవైపు గాయాలు కూడా శ్రీలంక క్రికెట్‌ను వెంటాడుతున్నాయి.

హసరంగా, చమీరా, అవిష్క ఫెర్నాండో, థీక్షణ వంటి స్టార్‌ ఆటగాళ్లు గాయాలతో బాధపడుతున్నారు. వీరు వరల్డ్‌కప్‌ సమయానికి కోలుకుంటారన్నది అనుమానమే. ఇక భారత చేతిలో ఘోర ఓటమిపై మ్యాచ్‌ అనంతరం లంక కెప్టెన్‌ దసున్‌ షనక స్పందించాడు. టీమిండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ తమ ఓటమిని శాసించాడని షనక తెలిపాడు.

అతడే మా కొంపముంచాడు..
మహ్మద్‌ సిరాజ్‌ అద్బుతమైన బౌలింగ్‌ ప్రదర్శన కనబరిచాడు. ఈ పిచ్‌ బ్యాటర్లకు బాగా అనుకూలిస్తుందని నేను భావించాను. అందుకే టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నాను. కానీ ఈ నిర్ణయం మిస్‌ఫైర్‌ అయింది. వాతవారణ పరిస్ధితులు కూడా కీలక పాత్ర పోషించాయి. మేము ఇది మర్చిపోలేని రోజు. మేము మా బ్యాటింగ్‌ టెక్నిక్‌ను మెరుగుపరుచుకుని క్రీజులో నిలదొక్కుకుని ఉండి ఉంటే బాగుండేది.

కానీ అది మేము చేయలేకపోయాం. ఫైనల్లో మేము ఓడిపోయినప్పటికీ మాకు చాలా సానుకూలాంశాలు ఉన్నాయి. ఈ టోర్నీలో సదీర, కుసల్‌ మెండీస్‌ స్పిన్నర్లను ఆడిన విధానం గురుంచి ఎంత చెప్పుకున్న తక్కువే. అదేవిధంగా ఆసలంక కూడా తన మార్క్‌ను చూపించాడు. ఈ ముగ్గురూ భారత పిచ్‌లపై కూడా అద్భుతంగా ఆడగలరు.

అయితే ఇటువంటి క్లిష్ట పరిస్థితుల నుంచి ఎలా పుంజుకోవాలో మాకు తెలుసు. మేము పాకిస్తాన్‌ వంటి మేటి జట్లను ఓడించి ఫైనల్‌కు వచ్చాం. మా బాయ్స్‌ గత కొంతకాలంగా బాగా రాణిస్తున్నారు. మాకు సపోర్ట్‌ చేయడానికి వచ్చిన అభిమానులందరికీ ధన్యవాదాలు. అయితే మా ఆటతీరుతో మిమ్మల్ని నిరాశపరిచినందుకు క్షమించండి. అదే విధంగా విజేత భారత్‌కు నా అభినందనలు అంటూ పోస్ట్‌మ్యాచ్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో షనక చెప్పుకొచ్చాడు.
చదవండి: నాకు ఒక మెసేజ్‌ వచ్చింది.. అందుకే సిరాజ్‌కు మళ్లీ బౌలింగ్‌ ఇవ్వలేదు: రోహిత్‌ శర్మ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top