
సెప్టెంబర్‌లో ఆసియా కప్.. భారత్-పాక్ మ్యాచ్ ఉంటుందా?క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఆసియాకప్-2025 సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ జూలై మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు క్రిక్‌బజ్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది.
వాస్తవానికి టీ20 ఫార్మాట్‌లో జరగనున్న ఈ మెగా ఈవెంట్‌కు భారత్ ఆతిథ్యమివ్వాల్సి ఉంది. కానీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో జరిగిన ఒప్పందం ప్రకారం.. పాక్ తమ మ్యాచ్‌లను యూఏఈలో ఆడనుంది. కానీ ఇప్పుడు మ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య రాజీకీయ ఉద్రిక్తలు మరింత పెరిగాయి.
దీంతో ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ పాల్గోంటుందా? ఒకవేళ పాల్గోన్న భారత్ దాయాది జట్టుతో ఆడుతుందా అన్నది ఇంకా ప్రశ్నార్ధకంగానే ఉంది. ఈ విషయాలపై మరి కొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశముంది. ఈ మెగా టోర్నీలో పాల్గోనే ఆరు జట్లలో అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, యూఎఈ ఉన్నాయి.
ప్రభుత్వం నిర్ణయమే ఫైనల్..
కాగా పాకిస్తాన్‌తో ఉద్రిక్తల కారణంగా ఆసియాకప్ నుంచి వైదొలగాలని భారత్ నిర్ణయించుకుందని తొలుత వార్తలు వినిపించాయి. ఈ వార్తలను కార్యదర్శి దేవజిత్ సైకియా ఖండించారు. అవన్నీ ఆ వాస్తవమని, తాము ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అని సైకియా కొట్టిపారేశారు. తాజాగా మరో బీసీసీఐ సీనియర్ ఆధికారి కూడా ఇదే విషయాన్ని స్ఫష్టం చేశారు.
"ఆసియాకప్‌లో పాల్గోకపోవడం లేదా మ్యాచ్‌లను బాయ్‌కట్ చేయడం గురుంచి ఎటువంటి చర్చ కూడా జరగలేదు. ఐసీసీ ఈవెంట్లలో మేము పాకిస్తాన్‌తో ఆడుతాము. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మేము నడుచుకుంటాము.
ఒకవేళ గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్ రాకపోతే అందుకు తగ్గట్టు నిర్ణయం తీసుకుంటాము. ఈ టోర్నీకి సంబంధించి రాబోయే రోజుల్లో మాకు ఒక క్లారిటీ వస్తోంది" అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ఇన్‌సైడ్ స్పోర్ట్‌తో పేర్కొన్నారు.