Hardik Pandya: హ్యాట్సాఫ్‌ హార్దిక్‌ పాండ్యా.. అశ్విన్‌ ప్రశంసల జల్లు! ఇలాంటి స్టార్‌ నోటి నుంచి..

Ashwin Praises India All Rounder Hats Off to Hardik Pandya Why - Sakshi

India Vs Australia: ‘‘సాధారణంగా మనమంతా మన వైఫల్యాలకు ఇతరులను బాధ్యులను చేసేలా మాట్లాడతాం. మనం నిరాశ చెందాల్సి వచ్చిన సమయంలో మూఢనమ్మకాలు, ఇతరత్రా కారణాలు చూపి తప్పించుకోవాలని చూస్తాం. కానీ హార్దిక్‌ అలా కాదు. టెస్టులు ఆడేందుకు ప్రస్తుతం తాను అర్హుడిని కానని తనే స్వయంగా అంగీకరించాడు’’ అంటూ టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌.. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాను ప్రశంసించాడు.

స్టార్‌ నోటి నుంచి ఇలాంటి మాటలు..
పాండ్యాలాంటి స్టార్‌ నోటి నుంచి ఇలాంటి మాటలు రావడం అతడి గొప్పదనానికి నిదర్శనమని.. హ్యాట్సాఫ్‌ హార్దిక్‌ పాండ్యా అంటూ ఆకాశానికెత్తాడు. కాగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ నేపథ్యంలో తొలి మ్యాచ్‌కు పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా టీమిండియా సారథిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముంబై వన్డేకు ముందు మీడియాతో మాట్లాడిన హార్దిక్‌కు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జట్టు కూర్పు గురించి ప్రశ్న ఎదురైంది.

డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడే అవకాశం ఉందా అని విలేకరులు హార్దిక్‌ను ప్రశ్నించగా.. తానిప్పుడు టెస్టులు ఆడేందుకు ఏమాత్రం సిద్ధంగా లేనని, వేరొకరి స్థానాన్ని ఆక్రమించలేనని వ్యాఖ్యానించాడు. టీమిండియా టెస్టు విజయాల్లో తన పాత్ర ఏమాత్రం లేదని.. అలాంటిది జట్టులో చోటుకు అర్హుడినెలా అవుతానని ప్రశ్నించాడు. హార్దిక్‌ వ్యాఖ్యలపై స్పందించిన అశ్విన్‌ హిందుస్థాన్‌ టైమ్స్‌తో మాట్లాడుతూ.. అతడి నిజాయితీని మెచ్చుకున్నాడు.

హార్దిక్‌ కెప్టెన్సీ అమోఘం
ఇక ఆసీస్‌తో తొలి వన్డేల్లో టీమిండియా ఘన విజయం నేపథ్యంలో.. ‘‘రోహిత్‌ శర్మ గైర్హాజరీలో హార్దిక్‌ టీమిండియాను ముందుండి నడిపించాడు. ఆస్ట్రేలియా భారీ స్కోరు చేస్తుందని అంతా భావించారు. కానీ హార్దిక్‌ తెలివిగా సిరాజ్‌, షమీతో వరుస ఓవర్లు వేయించి సఫలమయ్యాడు. స్పిన్నర్లు రెండు వికెట్లు తీసిన తర్వాత కూడా పేసర్లకు ఉన్న అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు.

155కి కేవలం మూడు వికెట్లు కోల్పోయి పటిష్టంగా ఉన్న జట్టును 188 పరుగులకే ఆలౌట్‌ చేయడమంటే మాటలు కాదు’’ అని హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీ నైపుణ్యాలను ప్రశంసించాడు. కాగా ముంబై వన్డేలో గెలుపొందిన టీమిండియా.. వైజాగ్‌ మ్యాచ్‌లో ఆసీస్‌ చేతిలో ఓడిపోయింది. దీంతో 1-1తో సమమైన సిరీస్‌ ఫలితం మార్చి 22నాటి చెన్నై ఫలితంతో తేలనుంది. ఇదిలా ఉంటే.. బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023లో భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన అశ్విన్‌.. జూన్‌ 7న మొదలుకానున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సిద్ధమవుతున్నాడు.

చదవండి: IPL 2023: పంజాబ్‌ కింగ్స్‌కు ఊహించని షాక్‌.. విధ్వంసకర వీరుడు దూరం!
ICC Rankings: ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో భారీ కుదుపు.. నంబర్‌ 1 స్థానం కోసం కొత్త ఛాలెంజర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top