
మాడ్రిడ్: ఈ ఏడాది తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ ప్రపంచ నంబర్‌వన్ అరీనా సబలెంకా (Aryna Sabalenka- బెలారస్) మూడో సింగిల్స్ టైటిల్‌ను తన ఖాతాలో జమ చేసుకుంది. మాడ్రిడ్ ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 సిరీస్ టోర్నీలో టాప్ సీడ్ సబలెంకా మూడోసారి చాంపియన్‌గా నిలిచింది.
అమెరికా స్టార్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ కోకో గాఫ్ (Coco Gauff)తో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సబలెంకా 6–3, 7–6 (7/3)తో విజయాన్ని అందుకొని మూడోసారి మాడ్రిడ్ ఓపెన్ టైటిల్‌ను దక్కించుకుంది. 2023, 2021లలో కూడా సబలెంకా ఈ టోర్నీలో చాంపియన్‌గా నిలిచింది.
ఈ క్రమంలో పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) తర్వాత మాడ్రిడ్ ఓపెన్ టైటిల్‌ను మూడుసార్లు గెలిచిన రెండో ప్లేయర్‌గా సబలెంకా గుర్తింపు పొందింది. ఓవరాల్‌గా సబలెంకా కెరీర్‌లో ఇది 19వ టైటిల్‌కాగా, ఈ ఏడాది మూడోది.
ఈ సంవత్సరం ఆమె బ్రిస్బేన్ ఓపెన్, మయామి ఓపెన్‌లలో విజేతగా నిలిచింది. కోకో గాఫ్‌తో 1 గంటా 39 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సబలెంకా రెండు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది.
రూ. 9 కోట్ల 40 లక్షలు
తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయిన బెలారస్ స్టార్ ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. 142 పాయింట్లకుగాను సబలెంకా 81 పాయింట్లు, కోకో గాఫ్ 61 పాయింట్లు గెలిచారు. విజేతగా నిలిచిన సబలెంకాకు 9,85,030 యూరోల (రూ. 9 కోట్ల 40 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. రన్నరప్ కోకో గాఫ్‌కు 5,23,870 (రూ. 5 కోట్లు) యూరోల ప్రైజ్‌మనీతోపాటు 650 ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి.
ఒసాకా ఖాతాలో టైటిల్
మాలో (ఫ్రాన్స్): నాలుగేళ్ల నిరీక్షణకు తెరదించుతూ జపాన్ టెన్నిస్ స్టార్ నయోమి ఒసాకా (Naomi Osaka) డబ్ల్యూటీఏ సింగిల్స్ టైటిల్‌ను సాధించింది. ఆదివారం ముగిసిన ఎల్ ఓపెన్ 35 డబ్ల్యూటీఏ–125 టోరీ్నలో ఒసాకా విజేతగా నిలిచింది. 2021 ఆ్రస్టేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ తర్వాత ఒసాకాకు ఇదే తొలి టైటిల్ కావడం విశేషం. ఫైనల్లో ఒసాకా 6–1, 7–5తో కాజా జువాన్ (స్లొవేనియా)పై విజయం సాధించింది.
మ్యాచ్ ఆరంభం నుంచే సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన రెండో సీడ్ ఒసాకా... ఒక ఏస్ కొట్టి 6 డబుల్ ఫాల్ట్‌లు చేసింది. 6 బ్రేక్ పాయింట్లు కాచుకున్న ఈ మాజీ ప్రపంచ నంబర్‌వన్... ఓవరాల్‌గా 70 పాయింట్లు సాధించింది. 2023 జూలైలో పాపకు జన్మనిచ్చిన ఒసాకా ఆ తర్వాత నెగ్గిన తొలి డబ్ల్యూటీఏ టైటిల్ ఇదే. ఇటీవలి కాలంలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న 27 ఏళ్ల ఒసాక ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ టోర్న ఆస్ట్రేలియా ఓపెన్‌లో మూడో రౌండ్‌లో పరాజయం పాలైంది.
చదవండి: కెప్టెన్‌గానే కాదు.. వైస్ కెప్టెన్‌గానూ బుమ్రా అవుట్!.. రేసులో మూడు పేర్లు..