జ్యోతి సురేఖకు నిరాశ.. క్వార్టర్‌ ఫైనల్లో ఓటమి | Sakshi
Sakshi News home page

జ్యోతి సురేఖకు నిరాశ.. క్వార్టర్‌ ఫైనల్లో ఓటమి

Published Fri, May 24 2024 1:25 PM

Archery World Cup:  Jyothi Surekha Vennam Lost In Quarters To Sara Lopez

యెచోన్‌ (దక్షిణ కొరియా): ప్రపంచకప్‌ ఆర్చరీ టోర్నీ మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్లకు నిరాశ ఎదురైంది. భారత స్టార్స్, ప్రపంచ రెండో ర్యాంకర్‌ వెన్నం జ్యోతి సురేఖ, ప్రపంచ 12వ ర్యాంకర్‌ పర్ణీత్‌ కౌర్‌ క్వార్టర్‌ ఫైనల్లో వెనుదిరగ్గా... ప్రపంచ చాంపియన్‌ అదితి రెండో రౌండ్‌ లో, అవనీత్‌ కౌర్‌ రెండో రౌండ్‌లో నిష్క్రమించారు. 

క్వార్టర్‌ ఫైనల్స్‌లో జ్యోతి సురేఖ 142–145తో ప్రపంచ మూడో ర్యాంకర్‌ సారా లోపెజ్‌ (కొలంబియా) చేతిలో... పర్ణీత్‌ 138–145తో హాన్‌ సెంగ్యోన్‌ (దక్షిణ కొరియా) చేతిలో ఓటమి చవిచూశారు. 

అదితి 142–145తో అలెక్సిస్‌ రూయిజ్‌ (అమెరికా) చేతిలో, అవనీత్‌ 143–145తో ఒ యుహూన్‌ (కొరియా) చేతిలో పరాజయం పాలయ్యారు. పురుషుల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో ప్రథమేశ్‌ సెమీఫైనల్లోకి ప్రవేశించగా... ప్రియాంశ్‌ మూడో రౌండ్‌లో, అభిషేక్‌ వర్మ, రజత్‌ చౌహాన్‌ రెండో రౌండ్‌లో ఓడిపోయారు.   

సెమీస్‌లో యూకీ–ఒలివెట్టి జోడీ 
పారిస్‌: ఓపెన్‌ పార్క్‌ ఏటీపీ–250 టెన్నిస్‌ టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్‌)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్‌) జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో యూకీ–ఒలివెట్టి ద్వయం 6–3, 7–6 (7/4)తో సాండర్‌ అరెండ్స్‌–మిడిల్‌కూప్‌ (నెదర్లాండ్స్‌) జంటను ఓడించింది. 

80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ, ఒలివెట్టి జోడీ పది ఏస్‌లు సంధించింది. తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేసింది. నేడు జరిగే సెమీఫైనల్లో సాంటియాగో గొంజాలెజ్‌ (మెక్సికో)–వాసెలిన్‌ (ఫ్రాన్స్‌)లతో యూకీ, ఒలివెట్టి తలపడతారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement