యశస్వికి ‘డబుల్‌’...శ్రేయస్, కిషన్‌ అవుట్‌  | Annual Player Contracts For Team India Mens Team For 2023-24 Announced By BCCI, Check All Details Inside - Sakshi
Sakshi News home page

BCCI Annual Players Contract List: యశస్వికి ‘డబుల్‌’...శ్రేయస్, కిషన్‌ అవుట్‌ 

Published Thu, Feb 29 2024 12:16 AM

Annual contracts announced by BCCI - Sakshi

వార్షిక కాంట్రాక్ట్‌లు ప్రకటించిన బీసీసీఐ  

మొహమ్మద్‌ సిరాజ్‌కు ప్రమోషన్‌

ప్రతిభకు, మైదానంలో ప్రదర్శనకు బీసీసీఐ పట్టం కట్టింది...టెస్టుల్లో వరుస డబుల్‌ సెంచరీలతో చెలరేగిన యశస్వి జైస్వాల్‌ను ‘డబుల్‌ ప్రమోషన్‌’తో గుర్తించిన బోర్డు నిలకడైన ఆటతో సత్తా చాటిన హైదరాబాదీ పేసర్‌ సిరాజ్‌ను ఒక మెట్టు పైకి ఎక్కించింది. అగ్రశ్రేణి ఆటగాళ్లు తమ స్థాయిని నిలబెట్టుకోగా...క్రమశిక్షణ తప్పితే శిక్ష తప్పదంటూ శ్రేయస్, కిషన్‌లను పక్కన పెట్టింది. 30 మందితో కూడిన బీసీసీఐ కొత్త కాంట్రాక్ట్‌ జాబితాలో విశేషాలివి.
 
న్యూఢిల్లీ: 2023–24కు సంబంధించి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. సుదీర్ఘ కాలంగా భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న స్టార్‌ క్రికెటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, జస్‌ప్రీత్‌ బుమ్రా, రవీంద్ర జడేజా బీసీసీఐ కాంట్రాక్ట్‌ల జాబితాలో తమ ‘ఎ ప్లస్‌’ గ్రేడ్‌లను నిలబెట్టుకున్నారు. ఈ కేటగిరీలో గత ఏడాదితో పోలిస్తే ఎలాంటి మార్పూ జరగలేదు.

గ్రేడ్‌ ‘ఎ’లో ఇప్పటికే ఉన్న అశ్విన్, షమీ, హార్దిక్‌ పాండ్యాలతో పాటు కొత్తగా సిరాజ్, రాహుల్, గిల్‌ చేరారు.  గత ఏడాది కాలంగా వన్డే వరల్డ్‌ కప్‌ సహా పలు సిరీస్‌లలో కీలక ప్రదర్శనలతో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ అంచనాలను అందుకోవడమే ఈ ముగ్గురి ప్రమోషన్‌కు కారణం. టి20ల్లో అద్భుత ప్రదర్శనలతో చెలరేగుతూ వన్డే జట్టులోనూ ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌ గ్రేడ్‌ ‘బి’లో తన స్థానం నిలబెట్టుకోగా ఇందులో యశస్వి జైస్వాల్‌కు అవకాశం దక్కడం పెద్ద విశేషం.

సాధారణంగా తొలి సారి కాంట్రాక్ట్‌ ఇస్తూ ఆటగాళ్లను ‘సి’లో చేర్చి ఆపై ప్రదర్శనతో ప్రమోషన్‌లు ఇచ్చే బోర్డు యశస్వి అసాధారణ ఆటకు నేరుగా ‘బి’లో అవకాశం కల్పించింది. ‘సి’ జాబితాలో ఉన్నవారిలో కొందరు అప్పుడప్పుడు వన్డేల్లో మెరిసినా...దాదాపు అందరూ టి20 స్పెషలిస్ట్‌లే కావడం విశేషం.  

క్రమశిక్షణారాహిత్యంతో... 
‘వార్షిక కాంట్రాక్ట్‌లలో ఈ సారి శ్రేయస్‌ అయ్యర్, ఇషాన్‌ కిషన్‌ల పేర్లను పరిశీలించడం లేదు’ అని బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఇటీవలి పరిణామాలే అందుకు కారణం. వీరిద్దరు భారత్‌కు ఆడని సమయంలో రంజీ ట్రోఫీలో తమ రాష్ట్ర జట్ల తరఫున బరిలోకి దిగాలని బీసీసీఐ సూచించినా...దానిని పట్టించుకోలేదు. మానసిక ఆందోళన కారణంగా చూపి దక్షిణాఫ్రికా టూర్‌ మధ్యలోనే స్వదేశం వచ్చేసిన కిషన్‌ ఆ తర్వాత దుబాయ్‌లో పార్టీలో పాల్గొంటూ కనిపించాడు.

తమ జట్టు జార్ఖండ్‌ ఒక వైపు రంజీ ఆడుతుంటే అతను నేరుగా ఐపీఎల్‌ టీమ్‌ ముంబై ఇండియన్స్‌ శిక్షణా శిబిరానికి హాజరయ్యాడు. మరో వైపు ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో చోటు కోల్పోయిన తర్వాత శ్రేయస్‌ వెన్ను గాయంతో ముంబై తరఫున రంజీ క్వార్టర్‌ ఫైనల్‌ ఆడలేనని చెప్పాడు. అతని గాయంలో నిజం లేదని ఎన్‌సీఏ డాక్టర్లు ధ్రువీకరించినట్లుగా బోర్డు అంతర్గత సమాచారం. ఈ విషయంలో కోచ్‌ ద్రవిడ్‌ నివేదిక ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే వరల్డ్‌ కప్‌లో 530 పరుగులతో కీలక పాత్ర పోషించిన అయ్యర్‌ పట్ల తీవ్రంగా వ్యవహరించి...గాయం తర్వాత అక్టోబర్‌నుంచి ఇప్పటి వరకు అధికారిక టోర్నీ ఆడని హార్దిక్‌కు మాత్రం ‘ఎ’ గ్రేడ్‌ కాంట్రాక్ట్‌ కొనసాగించడం ఆసక్తికరం. జాతీయ జట్టుకు ఆడని సమయంలో కచ్చితంగా దేశవాళీ క్రికెట్‌ ఆడాలంటూ బీసీసీఐ ఇప్పుడు స్పష్టంగా పేర్కొనడం విశేషం.  

కొత్తగా పేసర్లకు... 
కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకుంటున్న రిషభ్‌ పంత్‌ గత ఏడాది కాలంలో ఎలాంటి క్రికెట్‌ ఆడకపోయినా...పూర్తిగా పక్కన పెట్టకుండా ఒక గ్రేడ్‌ తగ్గించి అతడిని కొనసాగించగా...పేలవ ప్రదర్శనతో అక్షర్‌ స్థాయి కూడా తగ్గింది. భారత్‌లో ఫాస్ట్‌ బౌలర్లను ప్రత్యేకంగా గుర్తించి ప్రోత్సహించే క్రమంలో ఐదుగురు బౌలర్లకు కొత్తగా ‘ఫాస్ట్‌ బౌలింగ్‌ కాంట్రాక్ట్‌’లు ఇవ్వడం విశేషం.

గత ఏడాది అక్టోబర్‌ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్‌ వరకు కాలాన్ని కాంట్రాక్ట్‌ కోసం పరిగణనలోకి తీసుకున్నారు. బోర్డు నిబంధనల ప్రకారం కనీసం 3 టెస్టులు లేదా 8 వన్డేలు, లేదా 10 టి20లు ఆడాలి. ఇంగ్లండ్‌తో రెండు టెస్టులు ఆడిన సర్ఫరాజ్‌ ఖాన్, ధ్రువ్‌ జురేల్‌ తర్వాతి మ్యాచ్‌ ఆడితే వారు నేరుగా ‘సి’ గ్రేడ్‌లోకి వచ్చేస్తారు. జట్టులో స్థానం కోల్పోయిన పుజారా, ఉమేశ్, శిఖర్, చహల్, హుడా సహజంగానే జాబితానుంచి దూరమయ్యారు.   

బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్‌ల జాబితా (2023–24) 
గ్రేడ్‌ ‘ఎ’ ప్లస్‌ (రూ.7 కోట్లు): రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, జస్‌ప్రీత్‌ బుమ్రా, రవీంద్ర జడేజా  
గ్రేడ్‌ ‘ఎ’ (రూ. 5 కోట్లు): అశ్విన్, మొహమ్మద్‌ షమీ, మొహమ్మద్‌ సిరాజ్, కేఎల్‌ రాహుల్, శుబ్‌మన్‌ గిల్, హార్దిక్‌ పాండ్యా 
గ్రేడ్‌ ‘బి’ (రూ. 3 కోట్లు): సూర్యకుమార్‌ యాదవ్, రిషభ్‌ పంత్, కుల్దీప్‌ యాదవ్, అక్షర్‌ పటేల్, యశస్వి జైస్వాల్‌ 
గ్రేడ్‌ ‘సి’(రూ.1 కోటి): రింకూసింగ్, తిలక్‌ వర్మ, రుతురాజ్‌ గైక్వాడ్, శార్దుల్‌ ఠాకూర్, శివమ్‌ దూ బే, రవి బిష్ణోయ్, జితేశ్‌ శర్మ, సుందర్, ముకేశ్‌ కుమార్, సంజు సామ్సన్, అర్ష్ దీప్, కేఎస్‌ భరత్, ప్రసిధ్‌ కృష్ణ, అవేశ్‌ ఖాన్, రజత్‌ పటిదార్‌ (వీరందరికీ మొదటిసారి కాంట్రాక్ట్‌ దక్కింది).  
కాంట్రాక్ట్‌లు కోల్పోయినవారు: అయ్యర్, ఇషాన్‌ కిషన్, పుజారా, ఉమేశ్‌ యాదవ్, శిఖర్‌ ధావన్, దీపక్‌ హుడా, యజువేంద్ర చహల్‌.

సిరాజ్, రాహుల్, గిల్‌ (‘బి’ నుంచి ‘ఎ’కి)  
కుల్దీప్‌ ‘సి’ నుంచి ‘బి’కి
పంత్, అక్షర్‌ (‘ఎ’ నుంచి ‘బి’ కి) 
యశస్వికి నేరుగా ‘బి’ గ్రేడ్‌ 

ఫాస్ట్‌ బౌలింగ్‌ కాంట్రాక్ట్‌లు: ఆకాశ్‌ దీప్‌ (బెంగాల్‌), ఉమ్రాన్‌ మలిక్‌ (జమ్మూ కశ్మీర్‌), యశ్‌ దయాళ్‌ (యూపీ), విద్వత్‌ కావేరప్ప, విజయ్‌కుమార్‌ వైశాక్‌ (కర్నాటక).   

Advertisement
 

తప్పక చదవండి

Advertisement