అంగ్‌క్రిష్‌ రఘువంశీపై కఠిన చర్యలు | Angkrish Raghuvanshi fined after angry reaction to controversial Dismissal | Sakshi
Sakshi News home page

అంగ్‌క్రిష్‌ రఘువంశీపై కఠిన చర్యలు

Apr 27 2026 12:37 PM | Updated on Apr 27 2026 12:54 PM

Angkrish Raghuvanshi fined after angry reaction to controversial Dismissal

PC: BCCI

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ యువ బ్యాటర్‌ అంగ్‌క్రిష్‌ రఘువంశీపై ఐపీఎల్‌ పాలక మండలి కఠిన చర్యలు తీసుకుంది. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా నిబంధనలు ఉ‍ల్లంఘించాడనే కారణంతో మ్యాచ్‌ ఫీజులో కోత విధించింది. ఐపీఎల్‌-2026లో భాగంగా  ఆదివారం నాటి మ్యాచ్‌లో ఏకనా స్టేడియంలో లక్నో- కోల్‌కతా జట్లు తలపడ్డాయి.

 అనూహ్య రనౌట్‌
ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆతిథ్య లక్నో తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. కోల్‌కతా బ్యాటింగ్‌కు దిగింది. లక్నో బౌలర్‌ మొహ్సిన్‌ ఖాన్‌ (Mohsin Khan) ఆదిలోనే చెలరేగి ఓపెనర్లు టిమ్‌ సీఫర్ట్‌ (0), అజింక్య రహానే (10) వికెట్లు కూల్చాడు. 

ఇక వన్‌డౌన్‌లో వచ్చిన అంగ్‌క్రిష్‌ రఘువంశీ అనూహ్యంగా రనౌటయ్యాడు. ప్రిన్స్‌ యాదవ్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌ చివరి బంతిని మిడాఫ్‌ దిశగా ఆడిన రఘువంశీ సింగిల్‌ కోసం ముందుకొచ్చాడు.

అబ్‌స్ట్రక్టింగ్‌ ద ఫీల్డ్‌
అయితే మరో ఎండ్‌లో ఉన్న కామెరాన్‌ గ్రీన్‌ నిరాకరించడంతో వెనుదిరిగాడు. ఈ క్రమంలో మిడాఫ్‌ దగ్గర బంతి అందుకున్న మహ్మద్‌ షమీ వికెట్ల వైపు విసిరాడు. ఆ బాల్‌ కాస్త రఘువంశీకి తాకగా... లక్నో జట్టు ‘అబ్‌స్ట్రక్టింగ్‌ ద ఫీల్డ్‌’ కోసం అప్పీల్‌ చేసింది.

తీవ్ర అసంతృప్తి
దీంతో పలుమార్లు రీప్లేను పరిశీలించిన థర్డ్‌ అంపైర్‌... రఘువంశీ దిశ మార్చుకున్నాడని నిర్ధారించి అతడిని అవుట్‌గా ప్రకటించాడు. ఈ నిర్ణయంపై రఘువంశీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కోపంగా మైదానాన్ని వీడాడు. హెల్మెట్‌ను విసిరేసి అసంతృప్తి వెళ్లగక్కాడు.

జరిమానాతో పాటు..
ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ పాలక మండలి చర్యలకు దిగింది. ‘‘ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్‌ 2.2 ప్రకారం.. మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో క్రికెట్‌ పరికరాలు, క్లాతింగ్‌ తదితర వస్తువులకు హాని కలిగించకూడదు. లక్నోతో మ్యాచ్‌ సందర్భంగా రఘువంశీ ఈ నిబంధనను ఉల్లంఘించాడు.

అందుకే అతడి మ్యాచ్‌ ఫీజులో 20 శాతం కోత విధించడంతో పాటు.. ఓ డిమెరిట్‌ పాయింట్‌ కూడా జత చేస్తున్నాం’’ అని ప్రకటన విడుదల చేసింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా- లక్నో జట్లు నిర్ణీత 20 ఓవర్లలో సరిసమానంగా చెరో 155 పరుగులు చేశాయి. ఈ క్రమంలో సూపర్‌ ఓవర్‌ నిర్వహించగా.. కోల్‌కతా విజయం సాధించింది.

చదవండి: LSG Vs KKR: నరాలు తెగే ఉత్కంఠ!.. ఫామ్‌లో లేకున్నా అందుకే అతడిని పంపించాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement