
టీ20 యోధుడు, వెస్టిండీస్ పొట్టి క్రికెట్ దిగ్గజం ఆండ్రీ రసెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆస్ట్రేలియాతో త్వరలో జరుగబోయే టీ20 సిరీస్ తనకు చివరిదని వెల్లడించాడు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోనూ రసెల్ తొలి రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. జులై 20, 22 తేదీల్లో ఈ రెండు మ్యాచ్‌లు రసెల్ స్వస్థలమైన జమైకాలో జరుగనున్నాయి.
37 ఏళ్ల రసెల్ వెస్టిండీస్ తరఫున 2010లో అరంగేట్రం చేసి 84 టీ20లు ఆడాడు. ఇందులో 163.1 స్ట్రయిక్‌రేట్‌తో 3 అర్ద సెంచరీల సాయంతో 1078 పరుగులు చేశాడు. బౌలర్‌గా 61 వికెట్లు తీశాడు. రసెల్ విండీస్ గెలిచిన రెండు టీ20 వరల్డ్‌కప్‌ల్లో (2012, 2016) కీలక సభ్యుడిగా ఉన్నాడు.
పొట్టి క్రికెట్‌లో ఘన చరిత్ర కలిగిన రసెల్.. ఈ ఫార్మాట్‌లో 561 మ్యాచ్‌లు ఆడి 168.31 స్ట్రయిక్‌రేట్‌తో 2 సెంచరీలు, 33 అర్ద సెంచరీల సాయంతో 9316 పరుగులు సాధించాడు. అలాగే బౌలింగ్‌లో 485 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా రసెల్ ఫ్రాంచైజీ క్రికెట్‌లో కొనసాగుతాడు.
దెబ్బ మీద దెబ్బ
టెస్ట్ క్రికెట్‌లో, వన్డేల్లో ప్రభ కోల్పోయి అదఃపాతాళానికి పడిపోయిన వెస్టిండీస్.. టీ20 ఫార్మాట్‌లో మాత్రం ఆడపాదడపా మెరుపులు మెరిస్తూ ఉంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో విండీస్ ఈ ఫార్మాట్‌లోనూ కిందికి పడిపోయే అవకాశం ఉంది. ఇటీవలే ఆ జట్టు టీ20 స్పెషలిస్ట్ నికోలస్ పూరన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా రసెల్ కూడా అదే బాటలో నడవడంతో టీ20ల్లో విండీస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
15 మంది సభ్యుల్లో ఒకరు
రసెల్ త్వరలో ఆస్ట్రేలియాతో ప్రారంభం కాబోయే టీ20 సిరీస్ కోసం ఎంపిక చేయబడ్డాడు. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన 15 మంది సభ్యుల్లో రసెల్ ఒకరు. ఈ సిరీస్ జులై 20, 22, 25, 26, 28 తేదీల్లో జమైకా (తొలి రెండు మ్యాచ్‌లు), సెయింట్ కిట్స్ (ఆఖరి మూడు మ్యాచ్‌లు) వేదికలుగా జరుగనుంది.
ఈ సిరీస్‌లో విండీస్ జట్టుకు షాయ్ హోప్ నాయకత్వం వహిస్తాడు. ఈ జట్టులో హెట్మైర్, హోల్డర్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, రోవ్‌మన్ పావెల్, రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్ లాంటి విధ్వంసకర బ్యాటర్లు ఉన్నారు.
ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్‌కు వెస్టిండీస్ జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్), జువెల్ ఆండ్రూ, జెడియా బ్లేడ్స్, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, షిమ్రాన్ హెట్మైర్, జాసన్ హోల్డర్, అకీల్ హోసేన్, అల్జరి జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, గుడకేష్ మోటీ, రోవ్‌మన్ పావెల్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్.