సెంచరీతో చెలరేగిన కెప్టెన్‌.. క్వార్టర్‌ ఫైనల్లో ఆంధ్ర | Andhra reached the Ranji Trophy quarterfinals | Sakshi
Sakshi News home page

Ranji Trophy 2023-24: సెంచరీతో చెలరేగిన కెప్టెన్‌.. క్వార్టర్‌ ఫైనల్లో ఆంధ్ర

Feb 13 2024 7:17 AM | Updated on Feb 13 2024 10:39 AM

Andhra reached the Ranji Trophy quarterfinals - Sakshi

సాక్షి, విజయనగరం: రంజీ ట్రోఫీ క్రికెట్‌ టోర్నీలో మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే గ్రూప్‌ ‘బి’ నుంచి ముంబై, ఆంధ్ర జట్లు క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి. ఎనిమిది జట్లున్న గ్రూప్‌ ‘బి’లో ఆరు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాక ముంబై 30 పాయింట్లతో తొలి స్థానంలో, ఆంధ్ర 25 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాయి. కేరళ 14 పాయింట్లతో మూడో స్థానంలో, ఛత్తీస్‌గఢ్‌ 13 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాయి. ఈనెల 16 నుంచి జరిగే చివరిదైన ఏడో రౌండ్‌ మ్యాచ్‌ల్లో కేరళతో ఆంధ్ర; అస్సాంతో ముంబై తలపడతాయి.

తమ చివరి మ్యాచ్‌లో ఆంధ్ర జట్టుపై ఇన్నింగ్స్‌ తేడాతో నెగ్గినా కేరళ జట్టు 21 పాయింట్లతో మూడో స్థానం వద్దే ఆగిపోతుంది కాబట్టి ముంబై, ఆంధ్ర జట్లకు క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌లు ఖాయమయ్యాయి. ఉత్తరప్రదేశ్‌తో సోమవారం ముగిసిన లీగ్‌ మ్యాచ్‌ను ఆంధ్ర జట్టు ‘డ్రా’గా ముగించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 271/5తో ఆట చివరిరోజు రెండో ఇన్నింగ్స్‌  కొనసాగించిన ఆంధ్ర 145 ఓవర్లలో 9 వికెట్లకు 429 పరుగులు చేసింది.

కెప్టెన్‌ రికీ భుయ్‌ (129; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) తన ఓవర్‌నైట్‌ స్కోరుకు మరో 29 పరుగులు జోడించి అవుటయ్యాడు. షేక్‌ రషీద్‌ (85; 10 ఫోర్లు), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (53 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. మ్యాచ్‌లో 72 పరుగులు చేయడంతోపాటు 5 వికెట్లు పడగొట్టిన ఆల్‌రౌండర్‌ శశికాంత్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.    

Advertisement
 
Advertisement
Advertisement