IND vs SA: 'దక్షిణాఫ్రికా టాస్ గెలిస్తే.. ఖచ్చితంగా మ్యాచ్‌ కూడా వాళ్లదే'

Aakash Chopra makes his predictions for the 1st India SA T20I - Sakshi

గురువారం(జూన్‌9) ఢిల్లీ వేదికగా దక్షిణాఫ్రికాతో తొలి టీ20లో టీమిండియా తలపడనుంది. ఈ సిరీస్‌కు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, జస్ప్రీత్‌ బుమ్రా వంటి సీనియర్‌ ఆటగాళ్లు దూరం కాగా.. తాజాగా స్టాండింగ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, వెటరన్‌ స్పిన్నర్‌ కుల్ధీప్‌ యాదవ్‌ గాయంతో సిరీస్‌ నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో భారత జట్టకు వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ సారథ్యం వహించనున్నాడు.

కాగా టీమిండియా జూనియర్‌ జట్టుతో ఆడుతుండగా.. దక్షిణాఫ్రికా మాత్రం తమ ఫుల్‌స్ట్రాంగ్త్‌తో బరిలోకి దిగనుంది. ఇక తొలి టీ20కు ముందు భారత మాజీ ఆటగాడు ఆకాష్‌ చోప్రా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. టీమిండియాతో జరిగే తొలి టీ20లో దక్షిణాఫ్రికా టాస్ గెలిస్తే కచ్చితంగా మ్యాచ్‌ గెలుస్తుందని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.

"ఈ మ్యాచ్‌లో భారత్ గెలుస్తుందని నేను ముందుగా చెప్పాను. కానీ ప్రస్తుత పరిస్థితులు దక్షిణాఫ్రికాకు అనుకూలంగా ఉన్నాయి. ప్రోటీస్‌ జట్టు టాస్‌ గెలిస్తే.. కచ్చితంగా మ్యాచ్‌ను వారే గెలుస్తారు. ఒక వేళ భారత్‌ టాస్‌ గెలిస్తే.. 51 శాతం టీమిండియాకు, 49 శాతం దక్షిణాఫ్రికాకు అవకాశం ఉంది.

ఇక చాహల్‌, రబాడ మూడు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టనున్నారు. చాహల్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. పంత్‌ కెప్టెన్‌ కాబట్టి  చాహల్‌ను డెత్ ఓవర్లలో బౌలింగ్‌ చేసే అవకాశం ఉంది. మిల్లర్‌, డికాక్‌పై చాహల్‌కు మంచి రికార్డు ఉంది. ఇక కగిసో రబాడ.. పవర్‌ప్లే, డెత్ ఓవర్లలో రెండుకు పైగా వికెట్లు సాధిస్తాడని నేను భావిస్తున్నాను.  

హార్దిక్, శ్రేయస్ కలిసి 65 కంటే ఎక్కువ పరుగులు చేస్తారు. హెడ్‌ కోచ్‌ రాహుల్ ద్రవిడ్ విలేకరుల సమావేశంలో హార్దిక్ ఫినిషర్ పాత్రను పోషిస్తాడని తెలిపాడు. అంటే అతడి బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పు చేయనట్టు తెలుస్తోంది. 10 ఓవర్ల తర్వాత తొలి వికెట్‌ పడితే అప్పుడు హార్ధిక్‌ను బ్యాటింగ్‌కు పంపితే బాగుంటుంది. శ్రేయాస్‌ను సఫారీ పేసర్లు బౌన్సర్లతో కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు.

క్వింటన్ డి కాక్, మారక్రమ్‌ కలిసి 65 కంటే ఎక్కువ పరుగులు చేస్తారు. డికాక్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అరుణ్‌ జైట్లీ స్టేడియంలో గతంలో కూడా భారత్‌పై డికాక్‌ బాగా ఆడాడు. అతడిని ఆడ్డుకునే బౌలర్ ఈ జట్టులో చాహల్ తప్ప ఇంక ఎవరూ లేరు అని" ఆకాష్‌ చోప్రా పేర్కొన్నాడు.
చదవండి: IND Vs SA 2022: దక్షిణాఫ్రికాతో తొలి టీ20.. ఉమ్రాన్‌ మాలిక్‌, ఆర్ష్‌దీప్‌ సింగ్‌కు నో ఛాన్స్‌..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top