‘సెంచరీ’ టెస్టులో విక్టరీ దక్కేనా?

100th Test between India and Australia - Sakshi

నేటి నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య వందో టెస్టు

ఒత్తిడిలో టీమిండియా, కెప్టెన్‌ రహానే

ఆత్మవిశ్వాసంతో ఆస్ట్రేలియా

సిరాజ్, శుబ్‌మన్‌ అరంగేట్రం

ఉదయం 5 గంటల నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

మెల్‌బోర్న్‌: బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీని నిలబెట్టుకునే ప్రయత్నంలో భారత్‌ ముందు మరో సవాల్‌ నిలిచింది. నేటి నుంచి మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ (ఎంసీజీ)లో జరిగే ‘బాక్సింగ్‌ డే’ రెండో టెస్టులో ఆస్ట్రేలియాతో భారత్‌ తలపడుతుంది. తొలి మ్యాచ్‌ లో నెగ్గిన ఆసీస్‌ సిరీస్‌లో 1–0తో ప్రస్తుతం ఆధిక్యంలో ఉండగా, ఈ మ్యాచ్‌లోనూ ఓడితే భారత్‌ సిరీస్‌ గెలుచుకునే అవకాశాలు ముగుస్తాయి. అడిలైడ్‌లో గెలిచిన జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా ఆస్ట్రేలియా జట్టు బరిలోకి దిగుతుండగా, భారత్‌ ఏకంగా  నాలుగు మార్పులు చేసింది.  

జడేజా, పంత్‌లకు చోటు
గత టెస్టులాగే ఈసారి కూడా భారత మేనేజ్‌మెంట్‌ తుది జట్టును ఒక రోజు ముందే ప్రకటించింది. విఫలమైన పృథ్వీ షా స్థానంలో ఓపెనర్‌గా శుబ్‌మన్‌ గిల్, సాహా స్థానంలో మరో కీపర్‌ రిషభ్‌ పంత్‌ జట్టులోకి వచ్చారు. షమీ గాయం కారణంగా తప్పుకోవడంతో పేసర్‌ సిరాజ్‌కు చోటు దక్కింది. అయితే కోహ్లికి బదులుగా రెగ్యులర్‌ బ్యాట్స్‌మన్‌ను కాకుండా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాకు స్థానం కల్పించడం విశేషం. రాహుల్‌ రూపంలో ప్రత్యామ్నాయం అందుబాటులో ఉన్నా... జడేజా వైపు జట్టు మొగ్గు చూపించింది.

ఐదో బౌలర్‌గా అతను జట్టుకు మరింత బలం చేకూర్చగలడని టీమ్‌ భావిస్తోంది. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లలో రాణించడం గిల్, పంత్‌ ఎంపికకు కారణం. అయితే కోహ్లిలాంటి స్టార్‌ లేని నేపథ్యంలో సహజంగానే బ్యాటింగ్‌ కొంత బలహీనంగా కనిపిస్తోంది. మయాంక్, గిల్‌ శుభారంభం అందించడం కీలకం. ఇప్పుడు ప్రధానంగా పుజారా, రహానే బ్యాటింగ్‌పైనే జట్టు భారీ స్కోరు చేయడం ఆధారపడి ఉంది. ఆంధ్ర క్రికెటర్‌ విహారి తనకు లభించిన మరో అవకాశాన్ని సరైన విధంగా ఉపయోగించుకోవాలి.

విదేశాల్లో అంతంత మాత్రమే రికార్డు ఉన్న జడేజా ఈసారి ఎలా ప్రభావం చూపిస్తాడనేది చూడాలి. బౌలింగ్‌లో ఇప్పుడు బుమ్రాపైనే పెను భారం పడింది. ఇంత కాలం అతను ఆడిన అన్ని మ్యాచ్‌లలో మరోవైపు నుంచి సీనియర్‌ ఇషాంత్‌ శర్మ లేదా షమీ సహకరించారు. ఉమేశ్‌ ఇప్పటికీ అద్భుతాలు చేయలేదు. ఇక సిరాజ్‌ ఆడుతోంది తొలి మ్యాచ్‌. అశ్విన్‌ గత మ్యాచ్‌లో లయ అందుకోవడం సానుకూలాంశం. మొత్తంగా కోహ్లి, షమీ దూరం కావడంతో రెండు విభాగాల్లోనూ కొంత బలహీనంగా మారిన జట్టు ఆసీస్‌ను నిరోధించాలంటే తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది.  

స్మిత్‌ చెలరేగితే...
వార్నర్‌ లేకపోవడంతో తొలి టెస్టులో ఆసీస్‌ ఓపెనింగ్‌ బలహీనంగా కనిపించింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో ప్రదర్శనతో బర్న్స్‌కు కావాల్సిన ఆత్మవిశ్వాసం దక్కగా, వేడ్‌ కూడా స్వేచ్ఛగా ఆడే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో మెరుగైన ఆరంభాన్ని జట్టు ఆశిస్తోంది. ఇక గత మ్యాచ్‌లో విఫలమైనా... స్మిత్, లబ్‌షేన్‌లను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ముఖ్యంగా భారత్‌పై అద్భుత రికార్డు ఉన్న స్మిత్‌ చెలరేగితే కష్టాలు తప్పవు. గ్రీన్‌ తనను తాను నిరూపించుకోగా, కెప్టెన్‌ పైన్‌ తన బ్యాటింగ్‌ విలువను చూపించాడు. ట్రావిస్‌ హెడ్‌ మాత్రం ఇంకా కుదురుకోవాల్సి ఉంది. వీటన్నింటికి మించి ఆసీస్‌ బలం పేస్‌ బౌలింగ్‌ త్రయంపైనే ఉంది. స్టార్క్, కమిన్స్, హాజల్‌వుడ్‌ సమష్టిగా చెలరేగితే పరిస్థితి ఎలా ఉంటుందో గత మ్యాచ్‌ చూపించింది. వీరికి లయన్‌ జత కలిస్తే ఆసీస్‌ పైచేయి సాధించడం ఖాయం.

100: భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇది వందో టెస్టు కానుంది. ఆస్ట్రేలియా 43 మ్యాచ్‌ల్లో, భారత్‌ 28 మ్యాచ్‌ల్లో గెలిచాయి. మిగతా 27 టెస్టులు ‘డ్రా’ అయ్యాయి. ఒక టెస్టు ‘టై’గా ముగిసింది. సొంతగడ్డపై ఆస్ట్రేలియా 30 టెస్టుల్లో గెలిచింది. 7 మ్యాచ్‌ల్లో ఓడి, 12 మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది. భారత్‌ స్వదేశంలో 21 టెస్టుల్లో నెగ్గి, 13 మ్యాచ్‌ల్లో ఓడింది. 15 ‘డ్రా’ కాగా, ఒక టెస్టు ‘టై’ అయింది.

సిరాజ్‌కు తొలి ‘టెస్టు’...
24 ఏళ్ల తర్వాత భారత్‌ తరఫున టెస్టు ఆడనున్న మరో హైదరాబాదీ. సరిగ్గా ఐదు వారాల క్రితం నాన్న చనిపోయాడు. చివరి చూపునకు వెళ్లవచ్చని బోర్డు అనుమతించినా... గుండెల్లో తన వేదనను దాచుకుంటూ ఆస్ట్రేలియాలోనే ఉండిపోయాడు. సహచరులు ఇచ్చిన స్థయిర్యంతో తన సాధనను కొనసాగించాడు. ఇప్పుడు ఆ బాధకు కాస్త ఉపశమనం అందించే అరుదైన అవకాశం అతనికి దక్కింది. స్వదేశం తిరిగి వెళ్లిపోకుండా అతను తీసుకున్న నిర్ణయం సరైన ఫలితాన్నందించింది. షమీ అనూహ్యంగా గాయపడటంతో మొహమ్మద్‌ సిరాజ్‌కు భారత తుది జట్టులో చోటు దక్కింది. సాధారణ ఆటో డ్రైవర్‌ కొడుకుగా మొదలైన అతని ప్రస్థానం ఇప్పుడు భారత టెస్టు క్రికెటర్‌గా ఎదగడం అసాధారణం.   

రంజీల్లో సూపర్‌
మూడు టి20 మ్యాచ్‌లలో 3 వికెట్లు... ఏకైక వన్డే లో వికెట్‌ దక్కనే లేదు... సిరాజ్‌ అంతర్జాతీయ రికార్డు ఇది. దీనిని చూస్తే అతను జాతీయ జట్టు తరఫున విఫలమయ్యాడనిపిస్తుంది. కానీ సిరాజ్‌కు అవకాశం ఇవ్వడంలో సెలక్టర్లే పొరపడ్డారని అనిపిస్తుంది. దేశవాళీలో అతని అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శనలన్నీ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ మ్యాచ్‌లలోనే వచ్చాయి. ఎరుపు బంతితోనే అతను ఎక్కువగా తన పదును చూపించాడు. సీమ్‌ను సమర్థంగా ఉపయోగించుకునే అతని గ్రిప్, బౌన్సర్లు సిరాజ్‌ బౌలింగ్‌లో ప్రధాన బలాలు.

తన తొలి రంజీ సీజన్‌ (2016–17)లోనే హైదరాబాద్‌ తరఫున 18.92 సగటుతో 41 వికెట్లు పడగొట్టి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఆ తర్వాత ఐపీఎల్‌లో సన్‌రైజర్స్, బెంగళూరు జట్లకు ప్రాతినిధ్యం వహించడం చకచకా జరిగిపోయాయి. నాలుగు అంతర్జాతీయ మ్యాచ్‌లు అతని సామర్థ్యంపై కొన్ని అనుమానాలు రేపినా ... తాజా ఐపీఎల్‌లో కోల్‌కతాపై 8 పరుగులకు 3 వికెట్లు తీసిన ప్రదర్శన సిరాజ్‌ను మళ్లీ సీన్‌లోకి తీసుకొచ్చింది.  

ఘనమైన రికార్డు
2018లో 10 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లలో సిరాజ్‌ 19.80 సగటుతో 55 వికెట్లు పడగొట్టాడు. ఇందులో దక్షిణాఫ్రికా ‘ఎ’పై రెండుసార్లు ఇన్నింగ్స్‌లో ఐదేసి వికెట్లు తీయగా... ఆస్ట్రేలియా ‘ఎ’పై 8 వికెట్లతో చెలరేగిన ప్రదర్శన కూడా ఉంది. ఆసీస్‌ ‘ఎ’ జట్టులో హెడ్, లబ్‌షేన్, ఖాజాలాంటి టెస్టు క్రికెటర్లున్నారు. భారత్‌ ‘ఎ’ తరఫున సిరాజ్‌ 16 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడాడు. ఇవన్నీ రంజీ ట్రోఫీకంటే నాణ్యతాపరంగా ఎక్కువ స్థాయివే.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌లలో కలిపి 12 మ్యాచ్‌లు ఆడిన సిరాజ్‌ 27.63 సగటుతో 44 వికెట్లు పడగొట్టాడు. షమీ లేక కొంత అదృష్టం కలిసొచ్చినా... ఈ గణాంకాలు చూస్తే టెస్టుల్లో అతనికి అవకాశం ఇవ్వడం సరైన నిర్ణయంగానే చెప్పవచ్చు. మొత్తంగా 38 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లలో కలిపి సిరాజ్‌ 23.44 సగటుతో 152 వికెట్లు తీశాడు. వన్డేలు, టి20లు ఎన్ని ఆడినా టెస్టు క్రికెటర్‌గా వచ్చే గుర్తింపే వేరు. ఇప్పుడు ఆ గౌరవాన్ని అందుకున్న సిరాజ్‌ మున్ముందు మరింత సత్తా చాటాలని చోటు పదిలం చేసుకోవాలని ఆశిద్దాం. 

వీవీఎస్‌ లక్ష్మణ్‌ (1996) తర్వాత హైదరాబాద్‌లో పుట్టి, టెస్టు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తొలి క్రికెటర్‌ సిరాజే కావడం విశేషం. మధ్యలో ప్రజ్ఞాన్‌ ఓజా ఆడినా... అతను భువనేశ్వర్‌లో పుట్టాడు.

భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇది వందో టెస్టు కానుంది. ఆస్ట్రేలియా 43 మ్యాచ్‌ల్లో, భారత్‌ 28 మ్యాచ్‌ల్లో గెలిచాయి. మిగతా 27 టెస్టులు ‘డ్రా’ అయ్యాయి. ఒక టెస్టు ‘టై’గా ముగిసింది. సొంతగడ్డపై ఆస్ట్రేలియా 30 టెస్టుల్లో గెలిచింది. 7 మ్యాచ్‌ల్లో ఓడి, 12 మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది. భారత్‌ స్వదేశంలో 21 టెస్టుల్లో నెగ్గి, 13 మ్యాచ్‌ల్లో ఓడింది. 15 ‘డ్రా’ కాగా, ఒక టెస్టు ‘టై’ అయింది.

పిచ్, వాతావరణం
ఈ టెస్టు కోసం డ్రాప్‌ ఇన్‌ పిచ్‌ను ఉపయోగిస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్‌కు సమంగా అనుకూలిస్తుంది. చక్కటి బౌన్స్‌ కూడా ఉంది. రెండు రోజులపాటు చిరుజల్లులు పడే అవకాశం మినహా... వాతావరణం బాగుంది.  టెస్టుకు ఇబ్బంది ఉండకపోవచ్చు.

జట్ల వివరాలు
భారత్‌ (తుది జట్టు): రహానే (కెప్టెన్‌), మయాంక్, గిల్, పుజారా, విహారి, పంత్,  జడేజా, అశ్విన్, ఉమేశ్, సిరాజ్, బుమ్రా. ఆస్ట్రేలియా (అంచనా): పైన్‌ (కెప్టెన్‌), బర్న్స్, వేడ్, లబ్‌షేన్, స్మిత్, హెడ్, గ్రీన్, స్టార్క్, లయన్, కమిన్స్, హాజల్‌వుడ్‌.

–సాక్షి క్రీడా విభాగం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top