భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇవాళ (జనవరి 21) ఓ చారిత్రక మైలురాయిని తాకనున్నాడు. అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో ఇప్పటివరకు 99 మ్యాచ్‌లు ఆడిన స్కై.. న్యూజిలాండ్‌తో నేడు జరుగబోయే మ్యాచ్‌తో మ్యాచ్‌ల సెంచరీని పూర్తి చేయనున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో భారతీయుడిగా రికార్డుల్లోకెక్కనున్నాడు.
భారత క్రికెట్‌లో ఇప్పటివరకు రోహిత్ శర్మ (159), విరాట్ కోహ్లి (125), హార్దిక్ పాండ్యా (124) మాత్రమే 100 టీ20 మ్యాచ్‌ల మైలురాయిని తాకారు.
మరో చారిత్రక మైలురాయి దిశగా..
మ్యాచ్‌ల సెంచరీతో పాటు సూర్య మరో చారిత్రక మైలురాయి దిశగా కూడా అడుగులు వేస్తాడు. మొత్తం టీ20 కెరీర్‌లో ఇప్పటివరకు 346 మ్యాచ్‌ల్లో 395 సిక్సర్లు కొట్టిన స్కై, మరో ఐదు సిక్సర్లు కొడితే 400 సిక్సర్ల క్లబ్‌లోకి ప్రవేశిస్తాడు. ఈ ఘనతను భారత క్రికెట్‌లో ఇప్పటివరకు కేవలం రోహిత్ శర్మ (547), విరాట్ కోహ్లి (435) మాత్రమే సాధించారు.
పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న సూర్య
నేటి మ్యాచ్‌లో చారిత్రక మైలురాయిని అందుకోబోతున్న సూర్య గత ఏడాది కాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. గతేడాది అతను 21 మ్యాచ్‌ల్లో కేవలం 12.62 సగటున 218 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో కనీసం ఒక్క అర్ధశతకం కూడా లేదు.
టీ20 వరల్డ్‌కప్ నేపథ్యంలో ప్రస్తుతం సూర్యపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. కెప్టెన్‌గా సఫలమవుతున్నప్పటికీ.. చెత్త ప్రదర్శన కారణంగా అతను ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నాడు. స్కై ఇదే ఫామ్‌ను ప్రపంచకప్‌లోనూ కొనసాగిస్తే అతని కెరీర్ అర్దంతరంగా ముగిసిపోయే ప్రమాదముంది.
ఇదిలా ఉంటే, భారత్-న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్ జరుగనుంది. నాగ్‌పూర్ వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.


