త్వరలో దౌల్తాబాద్‌ లైబ్రరీకి నూతన భవనం | - | Sakshi
Sakshi News home page

త్వరలో దౌల్తాబాద్‌ లైబ్రరీకి నూతన భవనం

Sep 27 2026 2:15 PM | Updated on Sep 27 2026 2:15 PM

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రం

దుబ్బాకటౌన్‌: జిల్లాలోని గ్రంథాలయాలభివృద్ధికి కృషి చేస్తానని జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌ దరిపల్లి చంద్రం తెలిపారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండల కేంద్రంలోని గ్రంథాలయాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలోని పుస్తకాలు, పాఠకులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. జిల్లావ్యాప్తంగా గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మండల ప్రజలకు మరింత మెరుగైన గ్రంథాలయ సేవలు అందించేందుకు ప్రత్యేక గ్రంథాలయ భవనం నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. గ్రంథాలయానికి అవసరమైన మౌలిక వసతులు, పుస్తకాలు మరియు ఇతర సౌకర్యాలపై చర్చించారు. కార్యక్రమంలో దౌల్తాబాద్‌ సర్పంచ్‌ అనురాధ ఉప సర్పంచ్‌, బాలకృష్ణ, ఏఈ షఫీ, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.

పల్లెలు ప్రగతిలో వికసించాలి

హుస్నాబాద్‌రూరల్‌: పల్లెలను ప్రగతిలో వికసింప చేయడానికి సర్పంచ్‌లు, అధికారులు ప్రణాళికా బద్ధంగా కృషి చేయాలని అదనపు డీఆర్‌డీఓ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. శనివారం హుస్నాబాద్‌ డీఐఓసీ సముదాయ సమావేశం మందిరంలో ఆరు మండలాల సర్పంచ్‌లు, కార్యదర్శులు, అధికారులకు వికసిత్‌ గ్రామ పంచాయతీ ప్రణాళికలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అదనపు డీఆర్‌డీఓ శ్రీనివాస్‌ మాట్లాడుతూ...వీబీజీ రాంజీ పథకంలో 318 పనులను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. మూడేళ్ల పనుల ప్రణాళికలను తయారు చేసుకుని పల్లెల ప్రగతిని వికసింపచేయాలని సూచించారు. పనుల గురించి గ్రామీణ రైతులకు తెలియ చేసి ఎక్కువ వ్యవసాయ రంగ అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. సమావేశంలో హుస్నాబాద్‌, కోహెడ, అక్కన్నపేట, మద్దూరు, ధూళ్మిట్ట, బెజ్జంకి మండలాల ఎంపీడీఓలు సురేశ్‌, మహిపాల్‌ రెడ్డి, జయరాం, ప్రవీణ, ఎంపీఓలు, పీఆర్‌ ఏఈలు, సర్పంచ్‌లు, కార్యదర్శులు పాల్గొన్నారు.

మోదీ నాయకత్వంలో

దేశం అభివృద్ధి

హుస్నాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్‌ మౌలిక వసతులు, సాంకేతికత, డిజిటల్‌, విద్య వంటి స్వావలంబన రంగాల్లో వేగంగా ముందుకు పోతుందని బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్క యశస్వి తెలిపారు. మోదీ 25 ఏళ్ల ప్రజా సేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని శనివారం ఆర్యవైశ్య భవన్‌లో పాఠశాలల విద్యార్థులకు ‘నా కలల భారత్‌ వికసిత్‌ భారత్‌ 2047’అనే అంశం పై చిత్ర లేఖనం, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా యశస్వి మాట్లాడుతూ...వికసిత్‌ భారత్‌ 2047 లక్ష్య సాధనలో నేటి విద్యార్థుల ఆలోచనలు, సృజనాత్మకత, భాగస్వామ్యం ఎంతో కీలకమన్నారు. పోటీల అనంతరం విజేతలకు స్మారక చిహ్నాలు అందించి అభినందించారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి ఖమ్మం వెంకటేశం, కార్యదర్శి పృథ్వీ, నాయకులు తిరుమల, దొడ్డి శ్రీనివాస్‌, వేణుగోపాల్‌రావు పాల్గొన్నారు.

మరమ్మతులు చేపడతాం

దుబ్బాక: ‘నాణ్యత తేలిపోయింది..’ అనే శీర్షికన శుక్రవారం సాక్షిలో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. మూడు రోజుల్లో దుబ్బాక–ముస్తాబాద్‌ రోడ్డులోని బ్రిడ్జిపై మరమ్మతులు చేపడతామని శనివారం ఆర్‌అండ్‌బీ డీఈ శ్రీకాంత్‌ ‘సాక్షి’కి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–12 లో భాగంగా కొమురవెల్లి మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి నిర్మించిన ప్రధాన కాలువపై నిర్మించిన బ్రిడ్జిపై తేలిన ఇనుపచువ్వల విషయంపై సంబంధిత ఏజెన్సీకి వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలని ఆదేశించామన్నారు. వారు మూడు రోజుల్లో పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement