ఎంపీ రఘునందన్‌రావు
చిన్నకోడూరు(సిద్దిపేట): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తోందని ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు. మండల పరిధిలోని చంద్లాపూర్‌లో సర్పంచ్ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో వివిధ పార్టీల నాయకులు శ్రీనివాస్‌గౌడ్, హరిబాబు, సాయిగౌడ్‌లతోపాటు వంద మంది ఎంపీ సమక్షంలో బీజేపీలో చేరారు. ఆయన మాట్లాడుతూ...15వ, 16వ ఆర్థిక సంఘం ద్వారా నేరుగా గ్రామ పంచాయితీలకు నిధులు కేటాయిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు వివరించి పార్టీని బలోపేతం చేయాలన్నారు.
ప్రకృతితో మమేకం కావాలి
పర్యాటక ప్రాంతాల సందర్శన అంటే మన సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకుంటూ ప్రకృతితో మమేకం కావడమని రఘునందన్‌రావు తెలిపారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మండల పరిధిలోని రంగనాయక సాగర్ వద్ద విద్యార్థులు, అధికారులు, కలెక్టర్ హైమావతితో కలిసి హెరిటేజ్ వాక్ నిర్వహించారు. పర్యాటక ప్రాంతాల సందర్శనతో ఆ ప్రాంతానికి సంబంధించిన చరిత్ర, సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకోవాలన్నారు. 175 దేశాల నుంచి టూరిస్టులు మన దేశానికి వస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డీఓ సదానందం, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ భవ్య, ఏఎంసీ చైర్మన్లు మీసం మహేందర్, దేవులపల్లి యాదగిరి, అధికారులు పాల్గొన్నారు.


