వీరనారి ఐలమ్మ | - | Sakshi
Sakshi News home page

వీరనారి ఐలమ్మ

Sep 27 2026 2:15 PM | Updated on Sep 27 2026 2:15 PM

● రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరి ● సిద్దిపేటలో చిట్యాల ఐలమ్మ విగ్రహానికి ఘన నివాళులు

● రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరి ● సిద్దిపేటలో చిట్యాల ఐలమ్మ విగ్రహానికి ఘన నివాళులు

సిద్దిపేటకమాన్‌: తెలంగాణ చరిత్రలో ఐలమ్మ ఒక గొప్ప పోరాట యోధురాలిగా నిలిచారని రాష్ట్ర రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. వీరనారి ఐలమ్మ 131వ జయంతిని పురస్కరించుకుని సిద్దిపేట పట్టణంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, మత్య్య పశు సంవర్థక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి శనివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ..ఐలమ్మ జయంతి సందర్భంగా అందరం ఘన నివాళులర్పిస్తూ వారి పోరాటస్ఫూర్తిని మరోసారి జ్ఞాపకం చేసుకుని ముందుకు నడవాల్సిన రోజున్నారు. మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా వారి పోరాటస్ఫూర్తిని భవిష్యత్‌ తరాలకు తెలియజేస్తుందన్నారు. దొడ్డి కొమురయ్య, సర్వాయి పాపన్న, కొమురంభీమ్‌, రావి నారాయణరెడ్డి వంటి అనేకమంది యోధులు ప్రజల హక్కుల కోసం, ఆనాటి సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడారన్నారు. వారి పోరాటాల ఫలితంగానే నేడు మనం ప్రజాస్వామ్య హక్కులను అనుభవిస్తున్నామన్నారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తితో నేటి యువత కూడా సమాజంలో వెనుకబడిన వర్గాలకు న్యాయం జరిగేలా ముందుకు రావాలన్నారు. రాష్ట్రంలో గొర్రెలు, మేకలు, పశువుల విషయాలపై ప్రభుత్వ శాఖల వద్ద లెక్కలు ఉన్నాయని, కానీ మన సమాజంలో ఎంతమంది ఏ వర్గానికి చెందినవారు ఉన్నారు అనే కుల జనాభా లెక్కలు మాత్రం మనకు స్పష్టంగా తెలియని పరిస్థితి ఉందన్నారు. దేశవ్యాప్తంగా కుల జనాభా లెక్కలు నిర్వహించాలనే డిమాండ్‌తో ఉద్యమం కొనసాగుతుందన్నారు. కేంద్రం ప్రభుత్వం చేపడుతున్న జనగణనలో కులాల వారీగా జనాభాను తెలుసుకునే అవకాశం కల్పించాలన్నారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తితో సిద్దిపేట జిల్లా గల్లీ నుంచి ఢిల్లీ వరకు మన హక్కుల కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం కొనసాగించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42%రిజర్వేషన్లు కల్పించే దిశగా కులగణన చేసిందన్నారు. 50% రిజర్వేషన్‌ పరిమితి, న్యాయపరమైన అంశాల నేపథ్యంలో సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. ఈ సమస్యలను అధిగమించాలంటే కచ్చితమైన, ప్రామాణికమైన, కులాల వారీగా జనాభా లెక్కలు అవసరమన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణనలో కులాల వారీగా జనాభా వివరాలను సేకరించేందుకు ప్రత్యేక అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ..భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన గొప్ప నాయకురాలు చాకలి ఐలమ్మ అన్నారు. ఆమె స్ఫూర్తిని తెలంగాణ ఉద్యమంలో గొప్పగా వాడుకున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్‌ హైమావతి, సీపీ రష్మీ పెరుమాళ్‌, అడిషనల్‌ డీసీపీ కుశాల్కర్‌, ఆర్డీఓ, తహాశీల్దార్‌, ఏసీపీ రవిందర్‌రెడ్డి, కార్పొరేషన్‌ చైర్లన్లు సరితా తిరుపతయ్య, జ్ఞానేశ్వర్‌, చరణ్‌కౌశిక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement