తీరనున్న సాగు నీటి కొరత
చిన్నకోడూరు(సిద్దిపేట): చిన్నకోడూరు మండలం రంగనాయక సాగర్ రిజర్వాయర్‌లోకి శనివారం నీటి పంపింగ్‌ను ఇరిగేషన్ అధికారులు ప్రారంభించారు. ఇరిగేషన్ ఎస్‌ఈ సుధాకిరణ్, ఈఈ శంకర్, డీఈ మంగారెడ్డి మూడు మోటార్లను ఆన్‌చేసి రంగనాయకసాగర్‌లోకి పంపింగ్‌ను ప్రారంభించారు. దీంతో సాగు నీటి ఇబ్బంది తీరునుందని అన్నదాతలు సంబురపడుతున్నారు. రంగనాయక సాగర్ జలాశయం అన్నదాతల వెతలు తీర్చేందుకు ఎంతగానో దోహదపడుతుంది. రిజర్వాయర్ నుంచి కుడి, ఎడమ కాలువల ద్వారా సిద్దిపేట నియోజకవర్గంతోపాటు సిరిసిల్ల జిల్లాలోని చెరువులు, కుంటలకు తద్వారా పంట పొలాలకు నీరందిస్తారు. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 0.95 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. మరో 1 టీఎంసీ నీటిని రిజర్వాయర్‌లో నింపడానికి అధికారులు సిద్ధం చేశారు.


