మాజీ మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేటజోన్: సిద్దిపేట నియోజకవర్గ బాలిక జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం సంతోషంగా ఉందని, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి సిద్దిపేటకు మంచి పేరు తేవాలని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆకాంక్షించారు. చైనాలో జరిగే సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికై న గట్ల మల్యాల పాఠశాల విద్యార్థిని బానోత్ ఈశ్వరి శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా మాజీ మంత్రి హరీశ్‌రావును కలిసింది. ఈ సందర్భంగా ఆయన ఈశ్వరిని ఘనంగా సన్మానించారు. మన దేశం తరఫున ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు. చైనాకు వెళ్లేందుకు రవాణ ఖర్చుల కోసం గ్రామ ప్రజలు ఒక్కటై డబ్బులు పోగు చేయడం అభినందనీయమని, తనవంతు సాయంగా రూ.50వేలు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. సాఫ్ట్‌బాల్ పోటీలకు తెలంగాణ రాష్ట్రం నుంచి ఈశ్వరి మూడుసార్లు ఎంపిక కావడం గొప్ప విషయమన్నారు.


