జిల్లాలో 70 శాతానికి పైగా వినియోగదారులు
యూపీఐ ద్వారానే చెల్లింపులు
2025–26లో 18.50 లక్షల కోట్ల లావాదేవీలు..
వీటి విలువ రూ.1.19 లక్షల కోట్లు
చార్జీల మోత నిర్ణయాన్ని విరమించుకోవాలని
కోరుతున్న ప్రజలు
రూ.2 వేలు మించితే ఎండీఆర్ 0.4శాతం
చేతిలో నగదు అవసరం లేదు...బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు..క్యూలో నిలబడాల్సిన అవసరం అంతకన్నా లేదు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) ద్వారా మొబైల్‌లో రెండు క్లిక్‌లతో బిల్లులు, ఫీజులు చెల్లిస్తున్న రోజులివి. జిల్లావ్యాప్తంగా దాదాపు 70శాతం మంది యూపీఐ ద్వారానే అన్నింటికీ పేమెంట్‌లు చేస్తున్నారు. పెద్ద వ్యాపార సంస్థలకు రూ.2వేలకు మించి చెల్లింపులు జరిపితే చార్జీలు తప్పవని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. అయితే ఈ చార్జీలు వ్యాపార సంస్థలకే వర్తించనున్నాయి. వ్యాపార సంస్థ నుంచి ప్రభుత్వం వసూలు చేస్తుందని ప్రకటించినప్పటికీ చివరకు ఆ భారం వినియోగదారుల పైనే వేస్తారని ఆందోళన చెందుతున్నారు.
– సాక్షి, సిద్దిపేట
గతంలో ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో చేతిలో డబ్బులు, వాలెట్‌లో డబ్బులు ఉన్నాయో లేవో చూసుకుని బయట అడుగు పెట్టే వారు. అలాంటిది నోట్ల రద్దు అయినప్పటి నుంచి నగదు రహిత లావాదేవీలను ప్రభుత్వం ప్రోత్సహించింది. దీంతో ఇప్పుడు చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే సరిపోతుందని వాలెట్ లేకుండానే బయటకు వెళ్తున్నారు. కొన్ని రంగాల్లో రూ.2 వేలు దాటిన లావాదేవీలపై శాతంతో సంబంధం లేకుండా రూ.5లు స్థిర ఎండీఆర్ వసూలు చేయాలని నిర్ణయించారు. బీమా ప్రీమియం, వివిధ రకాల బిల్లులు, రైలు టికెట్లు, పెట్రోల్, డీజిల్ కొనుగోలుపై అక్టోబర్ 15వ తేదీ నుంచి చార్జీలు వసూలు చేస్తామని కేంద్రం ప్రకటించింది. కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటనతో మళ్లీ నగదు రూపంలో చెల్లింపులకే మొగ్గు చూపే అవకాశాలున్నాయి.
రూ1.19లక్షల కోట్లు
జిల్లావ్యాప్తంగా 32 బ్యాంక్‌లకు చెందిన 165 శాఖలున్నాయి. 2.73లక్షల బ్యాంకుల ఖాతాలున్నాయి. 2025–26 సంవత్సరంలో 18.50లక్షల కోట్ల లావాదేవీలు జరగగా వీటి విలువ రూ.1.19లక్షల కోట్లు. ఏప్రిల్, మే, జూన్ 2026లో 7.85లక్షల లావాదేవీలు జరగగా వీటి విలువ రూ.30,234 కోట్లు. ఈ లెక్కల ప్రకారం చూస్తే దాదాపు 70శాతంకు పైగా ప్రజలు యూపీఐ ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. వ్యక్తిగత బదిలీలపై ఎలాంటి రుసుము వసూలు చేయమని ప్రకటించారు. పెద్ద వ్యాపార సంస్థలకు రూ.2వేలకు మించి చెల్లింపులు జరిపితే మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) 0.4శాతం చార్జీలు వసూలు చేయనున్నారు. ఈ చార్జీలు వ్యాపారస్తుల నుంచి వసూలు చేస్తామని చెప్పినప్పటికీ అది చివరకు వినియోగదారుడిపైనే భారం పడుతుంది. ఇలా వినియోగదారుడిపై ప్రతి ఏడాది కోట్లాది రూపాయాలు ఆర్థిక భారం పడనుంది.
70 శాతం సర్వీసులు యూపీఐ పేమెంటే
జిల్లావ్యాప్తంగా 5,99,242 విద్యుత్ కనెక్షన్లు ఉండగా అందులో గృహజ్యోతి, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పోగా మిగతా సర్వీసులకు ప్రతీ నెల బిల్లులను వసూలు చేస్తున్నారు. బిల్లులు చెల్లించే సర్వీసులలో మొత్తంగా 70 శాతం సర్వీసులు యూపీఐ ద్వారానే పేమెంట్ చేస్తున్నారు. దీనినిబట్టి చూస్తే చాలామంది యూపీఐని వినియోగిస్తున్నారని అర్థమవుతోంది. విద్యుత్ బిల్లులు ఆటో పే ఆప్షన్ పెట్టుకుంటే ఎండీఆర్ చార్జీలు ఏమీ పడవు. ఇలా ఆటో పే గృహ యజమానులకు అయితే బాగుంటుంది. అదే అద్దెకు ఉండే వారు ఆటో పే పెట్టుకోవడం వల్ల ఒక ఇంటి నుంచి మరో ఇంటికి అద్దెకి మారితే డబ్బులు పోయే ప్రమాదం ఉంటుంది. ఇలా వినియోగదారులు ఇబ్బంది పడే అవకాశాలున్నాయి.
ఇంధనం సేల్స్‌లో 60 శాతానికి పైగా
యూపీఐ పేమెంట్స్
జిల్లాలో పెట్రోల్ పంపులలో జరిగిన సేల్స్‌లలో దాదాపు 60 శాతానికి పైగా యూపీఐ ద్వారానే వినియోగదారులు చెల్లింపులు చేస్తున్నారు. హుస్నాబాద్ రోడ్‌లోని ఓ పెట్రోల్ పంప్‌లో 800 లీటర్ల పెట్రోల్, డీజిల్‌ను విక్రయించగా అందులో రూ.70 వేలు యూపీఐ ద్వారా చెల్లింపులు, మిగతా రూ.20 వేలు నగదు రూపంలో వినియోగదారుడు చెల్లించారు. ఇలా అన్ని పెట్రోల్ పంప్‌లలో ఎక్కువగా యూపీఐ ద్వారానే పేమెంట్‌లు జరుగుతున్నాయి. యూపీఐ పేమెంట్‌లపై చార్జీల వడ్డన విరమించుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
విద్యుత్తు బిల్లులు యూపీఐ పేమెంట్‌లు
నెల మొత్తం యూపీఐతో పేమెంట్ డబ్బులు
సర్వీసులు చేసిన సర్వీసులు
జూన్–2026 1,63,429 1,08,803 రూ.14,44,51,699
జూలై–2026 1,65,240 1,08,570 రూ.12,03,95,073
ఆగస్టు–2026 1,56,433 1,06,670 రూ.9,75,73,636


