నిమజ్జనం వేళ .. జాగ్రత్తలివి | - | Sakshi
Sakshi News home page

నిమజ్జనం వేళ .. జాగ్రత్తలివి

Sep 17 2026 8:29 AM | Updated on Sep 17 2026 8:29 AM

పటాన్‌చెరు మండలం పెద్ద కంజర్ల నేరేడు చెరువు ఆరుగురు విద్యార్థులను బలి తీసుకుంది. వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు చెరువులోకి దిగిన విద్యార్థుల్లో ఒకరు ఒక్కసారిగా మునిగిపోవడంతో.. అతడిని కాపాడేందుకు మరొకరు చేసిన ప్రయత్నం చివరకు ఆరు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.

– సాక్షిప్రతినిధి, సంగారెడ్డి/పటాన్‌చెరు

శిరీష చారిటబుల్‌ ట్రస్ట్‌కు చెందిన హాస్టల్‌ విద్యార్థులు సుమారు 20 మంది గణేశ్‌ నిమజ్జనం కోసం ఈ చెరువు వద్దకు వెళ్లారు. మొత్తం ఎనిమిది మంది విద్యార్థులు చెరువులోకి దిగారు. మిగిలిన వారంతా చెరువు గట్టున నిలబడ్డారు. కాస్త ముందుకు వెళ్లి వినాయకుడిని నిమజ్జం చేసే ప్రయత్నంలో ఒక్కసారిగా లోతు ఎక్కువ ఉండటంతో ఓ విద్యార్థి అదుపు తప్పి పడిపోయాడు.. అతడిని పట్టుకునే క్రమంలో మరొకరు.. ఇలా ఎనిమిది మందిలో ఆరుగురు విద్యార్థులు నీట మునిగారు. ఇద్దరు ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరారు. ఈ ఘటన జరిగిన ప్రదేశంలో చాలా సంవత్సరాలుగా నిమజ్జం చేస్తున్నారని స్థానికులు అంటున్నారు. అయితే ఊహించని విధంగా లోతు ఎక్కువగా ఉండటంతో ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.

మృతి చెందిన వారిలో నరసింహరాజ్‌(21), సుమంత్‌ రెడ్డి(17), గణేశ్‌(18), సిద్ధార్థ్‌ (17), శ్యామ్‌ కుమార్‌(17), ఉదయ్‌కుమార్‌(22) ఉన్నారు. విద్యార్థుల మృతదేహాలను పటాన్‌చెరులోని గ్లోబల్‌ ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనపై మంత్రులు పొన్నం ప్రభాకర్‌, దామోదర, మాజీ మంత్రి హ రీశ్‌ రావు త దితరులు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. విద్యార్థుల మృతి తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. కాగా సంగారెడ్డి జిల్లాలో పోలీసుశాఖ వద్ద నమోదైన విగ్రహాల సంఖ్య సుమారు 3,525 ఉన్నట్లు ఆశాఖ వర్గాలు తెలిపాయి. నిమజ్జనం చేసే చెరువులు, కుంటలు 66 నమోదైనట్లు తెలిపారు. నిమజ్జనం సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

అడ్డగోలు మట్టి తవ్వకాల వల్లే

చెరువు వద్ద జరిగిన సంఘటనలో చిన్నారులు మరింత లోతుగా వినాయకుడిని నిమజ్జనం చేయాలనే ఆలోచన వారి మునకకు కారణం అయి ఉంటుందని భావిస్తున్నా రు. అయితే చెరువుల్లో అడ్డగోలు మట్టి తవ్వకాల వల్లే గోతులు ప్రమాద భరితంగా మారుతున్నాయి. నియోజకవర్గంలోని అన్ని చెరువుల మట్టిని రాత్రికి రాత్రి గుట్టు చప్పుడు కాకుండా అమ్ముకుంటున్నారు. పర్యవసానంగా ప్రమాదకర గుంతలు ఏర్పడుతున్నాయి.

చెరువులు, కుంటల వద్ద పోలీసులు, అధికారులు ఏర్పాటు చేసిన ప్రదేశాల్లోనే వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయాలి.

ఎక్కువ లోతు, ఉధృతంగా ప్రవాహం ఉన్న చెరువుల గురించి ముందే తెలుసుకోవాలి.

అధికారులు ఏర్పాటు చేసిన కృత్రిమ కొలనులో చిన్న చిన్న విగ్రహాలను నిమజ్జనం చేయడం మంచిది.

ర్యాంప్‌ గానీ, ప్లాట్‌ఫామ్‌ నుంచే విగ్రహాన్ని నీటిలోకి వదలాలి.

భారీ, పెద్ద విగ్రహాలను తప్పనిసరిగా క్రేన్‌ సహాయంతో నిమజ్జనం చేయాలి.

నదిలో ప్రవాహం ఎక్కువ ఉన్న ప్రాంతాలకు వెళ్లకూడదు.

ఈత రానివారు, చిన్న పిల్లలు నీటిలోకి దిగకుండా పెద్దలు పర్యవేక్షించాలి.

మద్యం సేవించి నిమజ్జనానికి రావడం, నీటిలో దిగడం అస్సలు చేయకూడదు.

వినాయక శోభాయాత్ర సమయంలో విద్యుత్‌ తీగలు, రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద అప్రమత్తంగా ఉండాలి.

విగ్రహం ఎత్తు, బరువు బట్టి అవసరం మేరకు వ్యక్తులను, సహాయకులను అందుబాటులో ఉండేలా చూసు కోవాలి.

పోలీసులు,అధికారుల సూచనలు తప్పకుండా పాటించాలి.

– సాక్షిప్రతినిధి, సంగారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement