కనెక్షన్ల పేరిట దోపిడీ | - | Sakshi
Sakshi News home page

కనెక్షన్ల పేరిట దోపిడీ

Sep 17 2026 8:29 AM | Updated on Sep 17 2026 8:29 AM

పాత పాలసీ ప్రకారమే తీసుకుంటున్న క్షేత్రస్థాయి సిబ్బంది నూతన విద్యుత్‌ పాలసీతో వినియోగదారులకు మేలు కొత్త విధానంపై కొరవడిన అవగాహన

ఎవరు తీసుకున్నా ఉపేక్షించం

సిద్దిపేటఅర్బన్‌: చిన్నకోడూరు మండలంలోని ఓ గ్రామంలో రైతు కొత్తగా బోరు వేసుకున్నాడు. బోరు కోసం విద్యుత్‌ కనెక్షన్‌ కావాలని సంబంధిత లైన్‌మెన్‌ను కలిశాడు. లైన్‌మెన్‌ ఎస్టిమేషన్‌ వేసి రూ.40 వేల వరకు ఖర్చవుతుందని చెప్పగా రైతు డబ్బులు ఇచ్చాడు.

సిద్దిపేట అర్బన్‌ మండలంలోని ఓ గ్రామంలో నూతన ఇంటిని నిర్మించుకుంటున్న ఓ వ్యక్తి కరెంట్‌ కనెక్షన్‌ కోసం ఆ గ్రామ లైన్‌మెన్‌ను కలిస్తే అంచనా వేసి రూ.30 వేలు ఖర్చవుతుందని అంతా తానే చూసుకుంటానని చెప్పి డబ్బులు తీసుకున్నాడు. ఇలా అనేకమంది రైతులు, కొత్తగా ఇల్లు నిర్మించుకునే వారు నేరుగా విద్యుత్‌ శాఖ కార్యాలయానికి వెళ్లలేని వారు అధిక మొత్తం చెల్లించి మోసపోతున్నారు.

రాష్ట్రం ప్రభుత్వం ఇటీవలే కొత్త విద్యుత్‌ పాలసీని అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం వ్యవసాయ కనెక్షన్‌ కోసం రూ.9,125 చెల్లిస్తే ఒక కి.మీ వరకు విద్యుత్‌లైన్‌తోపాటు అవసరమైన పోల్స్‌ను ఉచితంగా విద్యుత్‌ శాఖ అందజేస్తుంది. 1 కి.మీ కంటే ఎక్కువ దూరం ఉంటే అంచనా వ్యయంతోపాటు అవసరమైన పోల్స్‌కు, వైర్‌కు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. పాత పాలసీ ప్రకారం ఇదే కనెక్షన్‌కు రూ.4,950 చెల్లించేవారు. దీనికి మూడు పోల్స్‌, అవసరమైన వైర్‌ ఇచ్చేవారు. ఎక్కువ అవసరం ఉంటే ఎన్ని పోల్స్‌ అవసరం అవుతాయో దాని ప్రకారం డబ్బులు ఇచ్చి కనెక్షన్‌ తీసుకోవాల్సి ఉండేది. ఇలా మొత్తంగా రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు వచ్చేది. నూతన గృహ విద్యుత్‌ కనెక్షన్‌ కోసం అయితే రూ.3,925 చెల్లిస్తే 1 కి.మీ లోపు విద్యుత్‌ కనెక్షన్‌ను ఇస్తారు. పాత పాలసీ ప్రకారం దీనికి దాదాపు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చయ్యేది.

అవగాహన లోపంతోనే దోపిడీ

నూతన విద్యుత్‌ పాలసీ వల్ల రైతులకు, గృహ వినియోగదారులకు ఎంతో మేలు కలుగుతుంది. అలాంటి పాలసీపై ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. పాలసీ అమలులోకి వచ్చి దాదాపు ఏడాది దాటిపోయినా ఇప్పటివరకు గ్రామాలలో దీనిపై పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం గమనార్హం. ఇప్పటికై నా అధికారులు నూతన విద్యుత్‌ పాలసీపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.

నూతన విద్యుత్‌ కనెక్షన్‌ కోసం రైతులు, గృహ వినియోగదారులు సిబ్బందికి డబ్బులు ఇవ్వవద్దు. నేరుగా విద్యుత్‌ శాఖ కార్యాలయంలో సంప్రదించి ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించి అవసరమైన పత్రాలు అందిస్తే 1 కి.మీ వరకు ప్రభుత్వమే కనెక్షన్‌ను ఏర్పాటు చేస్తుంది. మా సిబ్బంది ఎవరైనా ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని మా దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటాం. – రామచంద్రయ్య, డీఈ, సిద్దిపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement