న్యూస్‌రీల్
ఆదివారం శ్రీ 13 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
ఈసారి నిమజ్జనానికి నీళ్లేవీ?
గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా
పర్యావరణ పరిరక్షణకు చాలా మంది భక్తులు మట్టి వినాయక ప్రతిమలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మట్టి వినాయకులను ప్రతిష్ఠించి, పూజించే వారిని ‘సాక్షి’ ప్రోత్సహిస్తోంది.ఇందులో భాగంగా మట్టి వినాయకులను పూజించే భక్తులు సెల్ఫీ తీసుకుని ‘సాక్షి’కి పంపిస్తే, వారి ఫొటోలను ప్రచురించనున్నాం. వాట్సాప్ 8686960064కు పంపించండి మరి..
వినాయక చవితి పండుగ వచ్చే నాటికే చెరువులు, కుంటలు జలకళను సంతరించుకునేవి.. ఎల్‌నినో ప్రభావంతో ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రస్తుతం చెరువులు, వంకలు, వాగులు వెలవెలబోతున్నాయి. చాలా వరకు చెరువులు ఎండి, బీటలు వారగా, మరికొన్ని చోట్ల నీళ్లు అడుగంటాయి. వినాయక విగ్రహాల నిమజ్జనానికీ నీళ్లు లేని పరిస్థితి నెలకొంది. సోమవారం వినాయక చవితి పండుగను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా 3,250కి పైగావినాయక ప్రతిమలను ఏర్పాటు చేసేందుకు సిద్ధం చేశారు. నిమజ్జనాలకు చెరువుల్లో నీళ్లు చాలా తక్కువగా ఉండటంతో మండపాల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు.
– సాక్షి, సిద్దిపేట
జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు సగటున 510 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా ఇప్పటి వరకు 452 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చాలా మండలాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. జిల్లా వ్యాప్తంగా సగం చెరువుల్లో 25శాతం లోపే నీళ్లు ఉన్నాయి. ప్రతీ ఏడాది వినాయక చవితి సమయానికి చెరువులు నిండు కుండలా దర్శనమిచ్చేవి. జిల్లాలో 2,281 చెరువులుండగా అందులో 1,036 చెరువులో 25శాతం లోపు, 25 నుంచి 50శాతం లోపు 724 చెరువులు, 50 నుంచి 75శాతంలోపు 379 చెరువులు, 75 నుంచి 100శాతం వరకు 125 చెరువులు, 17 చెరువులు మత్తడి పోస్తున్నాయి. 25శాతంలోపు నీళ్లు ఉన్న చెరువులలో వినాయక నిమజ్జనం చేయడం కష్టంగా ఉండనుంది. వినాయక నిమజ్జనం వరకై నా వర్షాలు కురిసి చెరువులు నిండాలని భక్తులు కోరుకుంటున్నారు.
21 రకాల పత్రులకు ఇబ్బందే..
వినాయక చవితి సందర్భంగా 21 రకాల పత్రులతో పూజలు నిర్వహిస్తారు. ఈ సారి వర్షాలు తక్కువ కురవడంతో సంబంధించిన మొక్కలు, చెట్లు అంతగా పెరగలేదు. దీంతో వినాయక చవితి సందర్భంగా అవసరమైన అన్ని రకాల పత్రులలను సేకరించడం భక్తులకు కష్టంగా మారుతోంది.
మట్టి గణపతికే ప్రాధాన్యం
నవరాత్రులు ముగిసిన తర్వాత గణనాథుడిని నిమజ్జనం చేయడం ఆనవాయితీ, అయితే ప్లాస్టర్ ఆఫ్ పారిస్(పీఓపీ), రసాయన రంగులు అద్దిన విగ్రహాలను నీటిలో నిమజ్జనంచేయడం వల్ల జలవనరులు కలుషితమయ్యే ప్రమాదం ఉంది. పీఓపీ నీటిలో త్వరగా కరగకపోవడంతో పాటు, రసాయన రంగులతో నీటి నాణ్యత పై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయడం, సహజ రంగులను వినియోగించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు.
ఈ ఫొటోలో కనిపిస్తున్నది కొండపాక మండలం కమ్మంపల్లి చెరువు. ఈ గ్రామంలో దాదాపు 8 వరకు గణపతి మండపాలున్నాయి. ఈ గ్రామ చెరువులో చాలా తక్కువగా నీళ్లు ఉన్నాయి. ఐదు ఫీట్ల గణపతి విగ్రహాన్ని నిమ జ్జనం చేస్తే మునిగే పరిస్థితి కనిపించడం లేదు.
మట్టి గణపతిని పూజిద్దాం
పర్యావరణాన్ని పరిరక్షిద్దాం.. మట్టి గణపతిని పూజిద్దాం.. పీఓపీ విగ్రహాలను నిమజ్జనం చేయడం వలన జలజీవరాశులు అంతరించిపోయే ప్రమాదం ఉంది. రసాయన రంగులను స్ప్రే చేయడంతో తయారు చేసే వారు లంగ్స్ సంబంధిత వ్యాధుల బారీన పడుతున్నారు. మట్టి గణపతికి సహజ రంగులను వినియోగించాలి.
– డాక్టర్ డీఎన్. స్వామి,
పర్యావరణ ప్రేమికుడు


