● రేషన్ డీలర్లపై అధికారుల వత్తిడి సరికాదు ● రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు నాయికోటి రాజు
సిద్దిపేటజోన్: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని రాష్ట్ర రేషన్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు నాయికోటి రాజు డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ జరుగుతున్న నేపథ్యంలో 18నెలలుగా దొడ్డు బియ్యం రేషన్ దుకాణాల్లో నిల్వ ఉంచి అధికారులు ఇబ్బందులు పెడుతున్నట్లు ఆరోపించారు. బియ్యం వెనక్కి ఇవ్వని వారిపై కేసులు నమోదు చేస్తామని అధికారులు బెదిరింపు చర్యలకు పాల్పడడం తగదన్నారు. అధికారులు తమ వైఖరిని మార్చుకోవాలని సూచించారు. రేషన్ డీలర్లకు రెండవ కమిషన్ పేరిట రూ 300 చెల్లించాలని,అదేవిధంగా కార్పొరేషన్ పరిధిలో బకాయిలు ఉన్నా రూ 100 కోట్లను వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులు అందుబాటులోకి తేవాలన్నారు. సమస్యలపై సంఘటితంగా పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు నాగరాజు, ప్రతినిధులు ప్రభాకర్, శేఖర్, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.


