రూ.70 కోట్లతో తాగునీటి పథకం | - | Sakshi
Sakshi News home page

రూ.70 కోట్లతో తాగునీటి పథకం

Sep 13 2026 11:21 AM | Updated on Sep 13 2026 11:21 AM

● రోజూ సురక్షితమైన నీటి సరఫరా.. సర్వే పనులు ముమ్మరం ● 15న ప్రపంచ బ్యాంక్‌ అధికార ప్రతినిధుల బృందం పర్యటన

గౌరవెల్లి ప్రాజెక్టు నుంచి నేరుగా హుస్నాబాద్‌కు తాగునీరు
● రోజూ సురక్షితమైన నీటి సరఫరా.. సర్వే పనులు ముమ్మరం ● 15న ప్రపంచ బ్యాంక్‌ అధికార ప్రతినిధుల బృందం పర్యటన

హుస్నాబాద్‌: మున్సిపల్‌ పరిధిలోని పట్టణ ప్రజలకు ప్రతీరోజు తాగునీటిని అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బృహత్తర నీటి పథకానికి శ్రీకారం చుట్టాయి. తాగునీటి వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌ కింద రూ.70 కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు నుంచి నేరుగా హుస్నాబాద్‌ పట్టణ ప్రజలకు సురక్షితమైన నీటిని అందించేందుకు ఇరిగేషన్‌, మున్సిపల్‌ అధికారులు సర్వే పనులను ముమ్మరం చేశారు. హుస్నాబాద్‌ పట్టణ ప్రజలకు ప్రస్తుతం మహ్మదాపూర్‌ మిషన్‌ భగీరథ సంప్‌ నుంచి 2.7ఎంఎల్‌డీ నీటి సరఫరా చేస్తోంది. ఒక్కో వ్యక్తికి రోజు 135 ఎల్‌పీసీడీ (లీటర్స్‌ పర్‌ క్యాపిటా పర్‌ డే) నీటిని సరఫరా చేయాల్సి ఉంది. ప్రస్తుతం 80 ఎల్‌పీసీడీ నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారు. మిషన్‌ భగీరథ నీటిని రెండు రోజులకొకసారి మాత్రమే నీటి సరఫరా విడుదల కావడంతో పట్టణ ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి.

40 ఏళ్ల వరకు నీటి అవసరాలు

దృష్టిలో పెట్టుకుని..

హుస్నాబాద్‌ పట్టణంలో దాదాపు 6వేలకు పైగానే నల్లా కలెక్షన్లున్నాయి. దాదాపు 30వేలకు పైగా జనాభా ఉంది. త్వరలో హుస్నాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోకి నాగారం, పోతారం(ఎస్‌), గాంధీనగర్‌, మాలపల్లి, పందిల్ల, మహ్మదాపూర్‌ వంటి గ్రామాలు విలీనం కానున్నాయి. ప్రస్తుతం ఉన్న తాగునీటి అవసరాలే కాకుండా దాదాపు 30 నుంచి 40 ఏళ్ల వరకు సరిపడే విధంగా తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని అందుకు తగ్గట్లుగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం 25% (రూ.17.50 కోట్లు), వరల్డ్‌ బ్యాంక్‌ ద్వారా (రూ.35కోట్లు), రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపాలిటీ (రూ.17.50 కోట్లు) వాటా ధనంతో ప్రాజెక్టును నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు.

తాగునీటికి ఇబ్బందులు ఉండవు

గౌరవెల్లి రిజర్వాయర్‌ నుంచి నేరుగా హుస్నాబాద్‌ వరకు చేపట్టే తాగునీటి పథకం ద్వారా భవిష్యత్‌లో తాగునీటి ఇబ్బందులు ఉండవు. ఎండాకాలంతోపాటు ఏ కాలంలోనైనా ప్రతీ రోజు తాగునీరు సరఫరా చేసే అవకాశం ఉంటుంది. మిషన్‌ భగీరథ నీటి సరఫరా ఉన్నా లేకున్నా గౌరవెల్లి ద్వారా వచ్చే నీరు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటుంది. ఈ పథకం హుస్నాబాద్‌కు అతి పెద్ద నీటి వనరుగా ఎంతో ఉపయోగంగా ఉంటుంది.

–మల్లికార్జున్‌, మున్సిపల్‌ కమిషనర్‌, హుస్నాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement