జెట్టింగ్‌ యంత్రం వచ్చేనా? | - | Sakshi
Sakshi News home page

జెట్టింగ్‌ యంత్రం వచ్చేనా?

Sep 7 2026 7:39 AM | Updated on Sep 7 2026 7:39 AM

గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలో 2020 జూన్‌లో ప్రారంభమైన యూజీడీ పనులు అంచనాలు పెరిగి...రూ.155కోట్లతో పూర్తి చేశారు. ఇందులోభాగంగానే 130కిలోమీటర్ల భూగర్భ మురుగునీటి పైప్‌లైన్‌ వ్యవస్థతోపాటు నాలుగు చోట్ల ఎస్‌టీపీ(సీవరేజీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌)ల నిర్మాణం చేపట్టారు. ఈ వ్యవస్థ గత మూడున్నరేళ్లుగా అందుబాటులోకి వచ్చింది. కానీ పనులు లోపభూయిష్టంగా సాగటం వల్ల పలు కాలనీల్లో నిర్మించిన పైప్‌లైన్లకు లీకేజీలేర్పడ్డాయి. మరోవైపు కొన్ని చోట్ల చాంబర్లు ధ్వంసమయ్యాయి. ఫలితంగా జనావాసాల్లోకి యూజీడీ మురుగునీరు పారుతోంది. ఎక్కడైనా యాజీడీ చాంబర్లు నిండితే..వాటిని క్లియర్‌ చేయాల్సిన జెట్టింగ్‌ యంత్రం ఈ మున్సిపాలిటీకి అందుబాటులో లేదు. రూ.155కోట్లతో పనులు చేపట్టిన కాంట్రాక్ట్‌ ఏజెన్సీకి రూ.30కోట్లకుపైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సాకుతో సదరు కాంట్రాక్ట్‌ ఏజెన్సీ మున్సిపాలిటీకి జెట్టింగ్‌ యంత్రం సమకూర్చలేదు. ఫలితంగా యూజీడీ నిండినా, లీకేజీలేర్పడి క్లియర్‌ చేయాల్సి వస్తే...గతంలో సిద్దిపేట మున్సిపాలిటీ అధికారులను బతిమాలుకొని ఇక్కడికి జెట్టింగ్‌ యంత్రాన్ని తెప్పించుకునేవారు. అది కూడా కొన్ని గంటలు మాత్రమే వచ్చి వెళ్లేది. దీనివల్ల చాంబర్లు క్లియర్‌ కాక, రోడ్లపైనే దుర్గంధం పారేది.

త్వరలోనే కొనుగోలు చేస్తాం

పాలకవర్గ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరటంతో జెట్టింగ్‌ యంత్రం కొనుగోలుకు మార్గం సుగమమైంది. త్వరలోనే కొత్త యంత్రం కొనుగోలు చేస్తాం. ఇందుకు సంబంధించి ఓ ఏజెన్సీని సంప్రదించాం.

– గణేశ్‌రెడ్డి, గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ కమిషనర్‌

పాలకవర్గ సభ్యుల మధ్య ఏకాభిప్రాయంలో ఆలస్యం నెలకొనడం..గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలో అదనపు భారాన్ని మోపుతోంది. ఇక్కడ రూ.155 కోట్ల వ్యయంతో యూజీడీ(అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ) పనులు పూర్తి చేసినా రూ.60లక్షలు ఖర్చుపెట్టి శుద్ధి యంత్రం సమకూర్చలేకపోయారు. రూ.30కోట్లకుపైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయనే కారణంతో ఈ యంత్రం కొనుగోలులో జాప్యం చేస్తున్నారు. ప్రస్తుతం కొన్ని నెలలుగా యూజీడీ నిర్వహణకు నెలకు రూ.2లక్షలు అద్దె చెల్లించాల్సి రావడం చర్చనీయాంశంగా మారుతోంది. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ ఫోకస్‌ ఇది. –గజ్వేల్‌

ఏకాభిప్రాయంలో ఆలస్యంతో.. మున్సిపాలిటీపై భారం

జెట్టింగ్‌ యంత్రంకు సంబంధించిన వాస్తవ పరిస్థితులన్నీ పాలకవర్గ సభ్యులకు తెలుసు. కొత్త యంత్రం కొనుగోలు చేస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని, ఇది ప్రజారోగ్యానికి సంబంధించిన కీలకమైన విషయమని కూడా స్పష్టంగా తెలుసు. అయినా 14వ ఆర్థిక సంఘం నిధులతో రూ.60లక్షల వరకు వెచ్చించి సొంత జెట్టింగ్‌ కొనుగోలు విషయంలో ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. ఎవరి ఎజెండా వారు అమలు చేశారు. జెట్టింగ్‌ యంత్రం కొత్తది ఎందుకు...? అని కొందరు కౌన్సిలర్లు, యంత్రం కొనుగోలు చేసే డబ్బులను వడ్డీకిచ్చి ఆ డబ్బులతో అద్దె చెల్లిస్తే సరిపోతుందని మరికొందరు వాదించారు. దీంతో సొంత యంత్రం కొనుగోలులో నెలల తరబడి జాప్యం నెలకొంది. ఈ మధ్యలో పట్టణంలో యూజీడీ సమస్యలు తలెత్తి...నెలల తరబడి నెలకు రూ.2లక్షల అద్దైపె జెట్టింగ్‌ యంత్రాన్ని తెచ్చుకోవాల్సి వస్తోంది. ఈ లెక్కన మార్చి నెల నుంచి ఇప్పటివరకు లక్షల్లో దీనికోసం వెచ్చించారు. ఇప్పటికే ఇంటి పన్నుల చెల్లింపుల్లో వెనుకబడి...2025–26ఏడాదికి సంబంధించి రూ.3కోట్ల వరకు 15వ ఆర్థిక సంఘం నిధులు రాక, ఆర్థిక కష్టాల్లో ఉన్న మున్సిపాలిటీకి ఈ పరిణామం గుదిబండగా మారింది. అద్దె చెల్లించేబదులు...కొత్త యంత్రం మేలు విషయాన్ని ముందుగానే గ్రహించి ఉంటే వృథా ఖర్చు తప్పేది. ఎట్టకేలకు ఇటీవల ఈ అంశంపై పాలకవర్గం ఏకాభిప్రాయానికి వచ్చింది. ఇప్పటికై నా త్వరలో జెట్టింగ్‌ యంత్రం తెప్పించి వృథాకు చెక్‌ పెట్టాల్సి ఉంది. ఈ ఒక్క అంశమే కాదు. ప్రజలకు పనికొచ్చే పనుల్లో పాలకవర్గ ఏకాభిప్రాయలోపం అనర్థాలను సృష్టిస్తోంది.

కొనుగోలు కోసం ఏకాభిప్రాయంలో జాప్యం

జెట్టింగ్‌ యంత్రం అద్దెకు రూ.2లక్షలు చెల్లించాల్సిన దుస్థితి

సొంత జెట్టింగ్‌ యంత్రం కొనుగోలుతోనే సమస్యకు పరిష్కారం

గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలో దుస్థితి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement