రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల చంద్రం
ప్రశాంత్ నగర్(సిద్దిపేట): సకల జనులు సమ్మె చేసి సాధించుకున్న తెలంగాణలో రాజ్యాధికారం ఆధిపత్య కులాలదే అయిపోయిందని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఆధిపత్యకులాల్లోని పేదల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల చంద్రం అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పీఆర్‌టీయూ భవన్‌లో ఆదివారం ఐక్యవేదిక జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా తెల్జీరు శ్రీనివాస్‌యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. మా ఓట్లు మావాళ్లకే అనే నినాదంతో ఐక్యవేదిక పనిచేస్తుందన్నారు. బహుజనుల రాజ్యాధికారం సాధించే దిశగా ఐక్యవేదిక పోరాటం చేస్తుందని తెలిపారు.
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి రైల్వే స్టేషన్ నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం వీడటంలేదు. రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ సమయంలో స్టేషన్ ముందు ఏర్పాటు చేసిన వీధి దీపాల స్తంభాలు అడ్డుగా ఉన్నాయని తొలగించి పక్కకు పడవేశారు. కానీ ఇంతవరకు మళ్లీ తిరిగి బిగించకపోవడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. రాత్రి సమయంలో స్టేషన్ ఆవరణ చీకటిగా ఉంటుందని అటు వైపు వెళ్లాలన్నా భయపడుతున్నార ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా రైల్వే అధికారులు స్పందించి విద్యుత్ స్తంభాలను బిగించి లైట్లు అమర్చాలని కోరుతున్నారు.
సిద్దిపేటజోన్: జిల్లా కేంద్రంలోని చంద్రమౌళి గార్డెన్స్‌లో ఆదివారం జిల్లా యోగా ఛాంపియన్ పోటీలు కనులవిందుగా సాగాయి. ట్రెడిషనల్, ఆర్టిస్టిక్, రిథమిక్, తదితర అంశాల్లో వయస్సుల వారీగా బాలబాలికలకు, మహిళలకు, పురుషులకు వేర్వేరుగా పోటీలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 300 యోగ క్రీడాకారులు పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. పోటీలను ప్రముఖ యోగ గురువు గణేశ్ రవికుమార్, సిద్దిపేట యోగాసనా అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్, జిల్లా యోగ శిక్షకుడు సతీశ్ సంధ్యలు పర్యవేక్షించారు. అంతకుముందు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి వీరారెడ్డి, మెడికల్ కళాశాల ఆర్‌ఎంఓ సదానందం జ్యోతి ప్రజ్వలన చేసి సందేశమిచ్చారు.
వర్గల్ క్షేత్రంలో భక్తుల సందడి
వర్గల్(గజ్వేల్): వర్గల్ శ్రీవిద్యాసరస్వతీ క్షేత్రం ఆదివారం చిన్నారుల అక్షర స్వీకారాలతో అలరారింది. శ్రావణమాసం దశమి శుభకరమని తల్లిదండ్రులు తమ చిన్నారులకు క్షేత్రంలో అక్షరాభ్యాసాలు జరిపించారు. మరోవైపు శ్రావణ వేళ దైవదర్శనం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు. కొండపైన సరస్వతి అమ్మవారిని, శంభులింగేశ్వరుడు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, వెంకటేశ్వరుని, శనీశ్వరుని దర్శించుకున్నారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు.
బెజ్జంకి(సిద్దిపేట): కరీంగనర్‌లో ఆదివారం నిర్వహిస్తున్న ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలకు మండలం నుంచి సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు తరలివెళ్లారు. సభలకు వెళ్లినవారిలో మండల కార్యదర్శి రూపేశ్, పరశురాములు, రాములు, వేణు, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.


