కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రావణమాసంలో చివరి వారం కావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. దీంతో ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. క్షేత్రానికి చేరుకున్న భక్తులు స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడిబియ్యం, కేశఖండన, గంగిరేణు చెట్టుకు ముడుపులు కట్టడం లాంటి మొక్కులు చెల్లించుకున్నారు. కొంతమంది భక్తులు స్వామి వారి నిత్య కల్యాణంలో పాల్గొని కొండపైన ఉన్న రేణుక ఎల్లమ్మ అమ్మవారికి బోనం సమర్పించి వేడుకున్నారు. స్వామి వారిని రాష్ట్ర నీటి పారుదల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరావు, కరీంనగర్ నీటిపారుదల జిల్లా అధ్యక్షుడు గంగర రమేశ్ దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.


