యువతకేదీ భరోసా? | - | Sakshi
Sakshi News home page

యువతకేదీ భరోసా?

Aug 25 2026 12:10 PM | Updated on Aug 25 2026 12:10 PM

ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా దరఖాస్తుల స్వీకరణ జిల్లాకు 361 యూనిట్లు.. దరఖాస్తులు 3,191 ఇప్పటికే పలు మండలాల్లో ఎంపిక కోసం ఇంటర్వ్యూలు యూనిట్ల సంఖ్య పెంచాలంటున్న నిరుద్యోగులు

స్వయం ఉపాధి అరకొరే..

స్వయం ఉపాధితో ఆర్థికంగా నిలదొక్కు కోవాలనుకున్న నిరుద్యోగుల ఆశలు.. యూనిట్ల పరిమితితో డోలాయమానంగా మారాయి. ఎస్సీ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పథకం కింద దరఖాస్తులు స్వీకరించడంతో భారీ సంఖ్యలో వచ్చాయి. ప్రభుత్వం మంజూరు చేసిన యూనిట్ల సంఖ్య మాత్రం అందులో పదో వంతుకు కూడా లేపోవడం గమనార్హం. దీంతో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ అవకాశం దక్కే పరిస్థితి కనిపించడం లేదు.

– సాక్షి, సిద్దిపేట

నిరుద్యోగులు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలన్న లక్ష్యంతో 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ఎలక్ట్రికల్‌ టూ వీలర్‌, ఎలక్ట్రికల్‌ త్రీ వీలర్‌, సోలార్‌ పంప్‌ కంట్రోల్‌, పాడి పశువులను సబ్సిడీ ద్వారా అందించేందుకు ఈ ఏడాది ఏప్రిల్‌ 23వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు. మండలాల్లో ఎంపీడీఓలు దరఖాస్తు దారులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఎంపికై న వారికి 70 శాతం నుంచి 100 శాతం సబ్సిడీ ద్వారా అందించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 3,191 దరఖాస్తులు రాగా 361 యూనిట్లు మాత్రమే మంజూరు చేశారు.

రూ. 5.37 కోట్లు

ఈవీ టూ వీలర్‌కు రూ.లక్ష యూనిట్‌ కాగా 90 శాతం సబ్సిడీ, ఈవీ త్రీ వీలర్‌ రూ.3లక్షలు. దీనికి 70 శాతం సబ్సిడీ. సోలార్‌ పంప్‌నకు రూ.3.7 లక్షలు కాగా వంద శాతం సబ్సిడీ. పాడి పశువులకు రూ.2లక్షలకు 80 శాతం సబ్సిడీని అందించనున్నారు. జిల్లాకు 361 యూనిట్ల టార్గెట్‌ కాగా వీటికి రూ. 5.37 కోట్లు మంజూరు కానున్నాయి. దరఖాస్తు చేసుకున్న వారిలో 11 శాతం మందికి మాత్రమే అవకాశం దక్కనుంది. మిగిలిన వారంతా ఎంపిక ప్రక్రియ పై ఆశలు పెట్టుకుని ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.

ఎంపికపైనే ఉత్కంఠ

స్వయం ఉపాధి పథకం కింద యూనిట్‌ వస్తే ఉపాధి పొందవచ్చని పలువురు భావిస్తున్నారు. అందుకే పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. ప్రస్తుతం యూనిట్ల సంఖ్య తక్కువగా ఉండటంతో ఎవరికి అవకాశం దక్కుతుందన్న దాని పై ఉత్కంఠ నెలకొంది. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి పైరవీలకు తీవులేకుండా నిబంధనల ప్రకారం ప్రక్రియ పూర్తి చేయాలని దరఖాస్తు దారులు కోరుతున్నారు. దరఖాస్తుల సంఖ్యకు అనుగుణంగా యూనిట్ల సంఖ్యను పెంచితే మరింత మంది నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.

‘రాజీవ్‌ యువ వికాసం’ ఏమాయె..

యూనిట్ల సంఖ్య పెంచాలి

నిరుద్యోగ ఎస్సీ యువతకు ఉపాధి కల్పించేందుకు సబ్సిడీ ద్వారా వివిధ వాహనాలు అందజేసేందుకు దరఖాస్తులను స్వీకరించారు. మంజూరు టార్గెట్‌ తక్కువ ఇవ్వడంతో తక్కువ మందికే లబ్ధిచేకూరనుంది. ఇప్పటికైనా ప్రభు త్వం స్పందించి యూనిట్ల సంఖ్య పెంచాలి.

– ఉమేశ్‌, సిద్దిపేట

ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది

స్వయం ఉపాధి కల్పించేందుకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. బడ్జెట్‌ రాగానే ఎంపికై న లబ్ధిదారులకు యూనిట్లను అందించనున్నాం. లబ్ధిదారుల ఎంపిక కోసం ఆయా ఎంపీడీఓలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఆయా మండలాలకు టార్గెట్లు ఇచ్చాం. ఎంపిక బాధ్యత అంతా ఎంపీడీఓలదే. – విజయ్‌ భార్గవ్‌,

ఈడీ, ఎస్సీ కార్పొరేషన్‌

బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఉమేశ్‌

చిన్నకోడూరు(సిద్దిపేట): ఎస్సీ కార్పొరేషన్‌లో ఆశించిన స్థాయిలో పథకాలు అమలు కావడం లేదని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఉమేశ్‌ ఆరోపించారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ రాజీవ్‌ యువ వికాసం పేరుతో దరఖాస్తులు స్వీకరించినా అమలు మాత్రం కాగితాలకే పరిమితమైందన్నారు. టూ వీలర్‌లు, త్రీ వీలర్‌లు అందిస్తామని చెప్పి మరోసారి దరఖాస్తులు తీసుకున్నా వాటి అమలుపై స్పష్టత లేదన్నారు. సిద్దిపేట జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క వాహనం కూడా ఎస్సీ నిరుద్యోగ యువతకు అందలేదన్నారు. ఎస్సీ నిరుద్యోగ యువతకు ఉపాధి ఎప్పుడు కల్పిస్తారని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement