● కలెక్టర్ హైమావతి ● అందిన అర్జీలు 90
సిద్దిపేటరూరల్: ప్రజలు అందించిన అర్జీలను సత్వరమే పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. ఈ మేరకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించిన అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్జీలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. వివిధ రకాల సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తంగా 90 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో డీఆర్‌ఓ నాగరాజమ్మ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
శక్తి పాలసీ వెనక్కి తీసుకోవాలి..
పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్‌ను గందరగోళానికి గురి చేసే శక్తి పాలసీని వెనక్కి తీసుకుని యూఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి, ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన, సమగ్ర సాంకేతిక విద్యను అందిస్తూ పాలిటెక్నిక్ కళాశాలల స్వయం ప్రతిపత్తిని కాపాడాల్సిన భాద్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
భవన నిర్మాణాన్ని నిలిపివేయండి
సిద్దిపేట పట్టణం పాతబస్టాండ్ దగ్గర జిల్లా మత్స్యశాఖకు చెందిన 150 గజాల స్థలాన్ని ఆక్రమించుకుని చేపడుతున్న నిర్మాణాన్ని నిలిపివేయాలని మత్స్యసహకార సంఘం నాయకులు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు బాల్‌రంగం మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సంఘంలో ఎంతో మంది మత్స్య పారిశ్రామిక సభ్యులు, మహిళా సభ్యులు ఉన్నారన్నారు. శిక్షణ, నైపుణ్యం, జీవనోపాధి, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పథకాలు సభ్యులకు అందుబాటులో ఉండేలా భవన నిర్మాణం చేపట్టాలన్నారు.
వర్షం ఎఫెక్ట్: తగ్గిన వినతులు
సాక్షి, సిద్దిపేట: మండల పరిషత్ కార్యాలయాల్లో జరిగిన ప్రజావాణిలో అర్జీలు అంతంత మాత్రమే వచ్చాయి. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్న 1గంటల వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఉదయం నుంచి వర్షం కురవడంతో ప్రజావాణికి దరఖాస్తు దారులు ఎక్కువగా రాలేదు. దీంతో వినతులు తగ్గాయి. గత సోమవారం 238 వినతులు రాగా ఈసారి 131 వినతులు వచ్చాయి. దూల్మిట్ట, మద్దూరు, రాయపోల్, వర్గల్ మండల కేంద్రాల్లో ఒక్క వినతి సైతం రాలేదు. అత్యధికంగా బెజ్జంకి మండలంలో వినతులు వచ్చాయి. ఆయా శాఖలకు చెందిన 456 మంది అధికారులు పాల్గొన్నారు.


