● లెక్కతేల్చేపనిలో యంత్రాంగం
● అనామలిస్ (తేడాలు) జాబితాపై నజర్
● 82,125 ఓటర్లకు నోటీసులు
జిల్లాలో సర్ ప్రక్రియ ఆధారంగా 1,19,500 ఓట్లు జాబితా నుంచి ఔట్ అయ్యే అవకాశం ఉందని ప్రాథమిక అంచనా.. ముఖ్యంగా వీటిలో చనిపోయిన వారు 33,256 కాగా, శాశ్వతంగా వలస వెళ్లి ఎన్యూమరేషన్ పత్రాలను తీసుకొని వారు 59,084 మంది ఉన్నారు. అందుబాటులో లేని వారు 11,460 మంది, ఇతర ప్రాంతాల్లో డబుల్ ఓట్లు ఉన్న వారు 6,047 మందితో పాటు వివిధ కారణాలతో 1,19,500 ఓటర్లను డిజిటలైజేషన్ చేయలేకపోయినట్లు సమాచారం.
– సిద్దిపేటజోన్
ఓటరు జాబితా సమగ్ర సవరణ(సర్) ప్రక్రియకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం వాస్తవ లెక్క తేల్చేపనిలో నిమగ్నమైంది. షెడ్యూల్ మేరకు ఎన్యూమరేషన్ పత్రాలను బూత్ లెవల్ ఆఫీసర్లకు ఇచ్చే ఆఖరి గడువు సోమవారంతో ముగిసింది. జిల్లాలో ఇప్పటికే డిజిటలైజేషన్ ప్రక్రియ దాదాపు పూర్తి అయినట్లే. దుబ్బాక, సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్ నియోజకవర్గాల్లో 9,92,967 మంది ఓటర్లకు గాను 8,73,647 ఎన్యూమరేషన్ పత్రాలను డిజిటలైజేషన్ చేశారు. వివిధ కారణాలతో 1,19,500 ఓట్లు అందుబాటులో లేకపోయినట్లు గుర్తించారు. వీటికి తోడు ఎన్యూమరేషన్ పత్రాలలో నమోదు చేసిన వివరాల్లో తేడాలు (అనామలిస్) ఉన్న వారి సంఖ్య 82,125గా తేలింది. వీరందరికి అధికారులు ఈనెల 17తర్వాత నోటీసులు జారీ చేయనున్నారు. పొంతన లేని వివరాలు నమోదు చేసిన వారందరూ అక్టోబర్ 15వరకు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి నిర్ధారించుకోవాలి. అప్పుడే ఓటరు జాబితాలో ఓటు ఉన్నట్లు. లేనిపక్షంలో ఓటుహక్కు పోయినట్టే.
నియోజకవర్గ వర్గాల వారీగా వివరాలు..
● సిద్దిపేట నియోజకవర్గంలో చనిపోయిన వారు 7,942 మంది. శాశ్వతంగా వలస వెళ్లిన వారు 23,037. అలాగే 5,586మంది అందుబాటులో లేకపోవడం, 1377 డబుల్ ఓట్లు కల్గి ఉండడం తదితర కారణాలతో 39,538 మంది ఎన్యూమరేషన్ డిజిటలైజేషన్ ప్రక్రియ నోచుకోలేదు.
● హుస్నాబాద్‌లో చనిపోయిన వారు 8091 మంది. శాశ్వతంగా వలస వెళ్లిన వారు 10,614, అందుబాటులో లేని వారు 1234, అలాగే డబుల్ ఓట్లు ఉన్న వారు 1,747మొత్తంగా 24,385 ఎన్యూమరేషన్ పత్రాలు డిజిటలైజేషన్ కాలేదు.
● దుబ్బాకలో చనిపోయిన వారు 6130 మంది. శాశ్వతంగా వలస వెళ్లిన వారు 8,513 మంది. అందుబాటులో లేని వారు 473, డబుల్ ఓట్లు ఉన్న వారు 803తో పాటు వివిధ కారణాలతో మొత్తంగా 17,900 పత్రాలు డిజిటలైజేషన్ నోచుకోలేదు.
● గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో చనిపోయిన వారు 10,093 మంది. శాశ్వతంగా వలస వెళ్లిన వారు16920, అందుబాటులో లేని వారు 4167, డబుల్ ఓట్లు ఉన్న వారు 2120తో పాటు వివిధ కారణాలతో మొత్తంగా 37,677 ఎన్యుమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ కాలేదు.
అత్యధికంగా సిద్దిపేటలో..
ఆయా నియోజకవర్గాల్లో ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి అనంతరం వివరాలు పరిశీలిస్తే.. సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో అత్యధికంగా ఓట్లు తగ్గే అవకాశం ఉంది. అత్యల్పంగా దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నట్లు అంచనా.


