హరీశ్ ఆధ్వర్యంలో పోలీస్ ఉద్యోగార్థులకు శిక్షణ శిబిరం
సిద్దిపేటజోన్: నిరుద్యోగ యువతకు ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆధ్వర్యంలో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నట్లు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాయిరాం తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగాల భర్తీ కోసం ఆందోళన చేపడతామని బీఆర్‌ఎస్ హెచ్చరికల నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డికి సోయి వచ్చిందన్నారు. అందులో భాగంగానే పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేశారన్నారు. సిద్దిపేట ప్రాంత యువత కోసం మాజీ మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో ‘కేసీఆర్ ఉచిత కోచింగ్ సెంటర్’ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. గతంలో కేసీఆర్ ఉచిత కోచింగ్ సెంటర్ ద్వారా ఎంతోమంది పోలీస్ కానిస్టేబుళ్లు, గ్రూపు, ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించారని గుర్తు చేశారు. నిరుద్యోగలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కోచింగ్ సెంటర్ అడ్మిషన్ల కోసం త్వరలోనే ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తామన్నారు. సమావేశంలో మాజీ కౌన్సిలర్ మోహిజ్, నాయకులు సోమిరెడ్డి, పాపయ్య, నరేష్, నరేందర్ రెడ్డి, దేవయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


