మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పిచ్చి మొక్కలను తొలగించి, దోమల నివారణకు పిచికారీ చేయాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం సిబ్బందిని ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్ర గ్రంథాలయ ఆవరణను వారు పరిశీలించారు. గ్రంథాలయ ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని, సిబ్బందికి సూచించారు. అనంతరం పట్టణంలోని మూడో వార్డులోని రంగధాంపల్లి బతుకమ్మ కుంటను కమిషనర్ పరిశీలించారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నీరు కుంటలో కలవడంతో నీరు కలుషితమవుతోందని స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు కుంటను సందర్శించారు. డ్రైనేజీ నీరు కుంటలోకి చేరకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సూచించారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు వంగ తిరుమల్‌రెడ్డి, ముత్యల కనకయ్య, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.
● సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సందెబోయిన ఎల్లయ్య
● గజ్వేల్‌లో ర్యాలీ, రాస్తారోకో
గజ్వేల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్‌లు, రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసేంతవరకు పోరాటం ఆగదని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సందెబోయిన ఎల్లయ్య అన్నారు. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా సోమవారం గజ్వేల్‌లో ర్యాలీ, రాస్తారోకో కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి, రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా సందెబోయిన ఎల్లయ్య మాట్లాడుతూ కార్పొరేట్‌లకు కొమ్ముకాస్తూ కేంద్రం కార్మికుల హక్కులను కాలరాస్తున్నదని ఆరోపించారు. కనీస వేతనాలు పెంచకపోవడం, 12గంటలపాటు పని గంటలు పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మరోవైపు రైతులకు సబ్సిడీలు ఎత్తివేయడం, పంటలు కొనుగోలు చేయకుండా చట్టాలను మార్చడం దారుణమన్నారు. ఈ విధానాలపై రాజీలేని పోరాటాలను కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బండ్ల స్వామి, నాయకులు రంగారెడ్డి, వేణుగోపాల్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
పీఎఫ్ ఆఫీస్ ఎదుట ఆందోళన..
సిద్దిపేటజోన్: నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని కోరుతూ సోమవారం జిల్లా కేంద్రంలోని పీఎఫ్ ఆఫీస్ ఎదుట ఆందోళన చేపట్టారు. అంతకుముందు సీఐటీయూ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న కార్మిక సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకదశలో కార్మిక సంఘాల నాయకులు ప్రతిఘటించారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు మల్లారెడ్డి, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి స్వామి తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): పట్టణంలోని 132 కేవీ సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని సిద్దిపేట డివిజనల్ ఇంజనీర్ రామచంద్రయ్య సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మున్సిపల్, అర్బన్, రూరల్, నారాయణరావుపేట మండలాల్లోని అన్ని ప్రాంతాలలో మధ్యాహ్నం 12 నుంచి 3.30 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని తెలిపారు.


