స్కావెంజర్ల ఆకలి కేకలు | - | Sakshi
Sakshi News home page

స్కావెంజర్ల ఆకలి కేకలు

Aug 6 2026 8:08 AM | Updated on Aug 6 2026 8:08 AM

మంజూరైన రూ.2 కోట్లు

అభివృద్ధి పనులకు మళ్లింపు

గత డీఈఓ తప్పిదంతో తప్పని తిప్పలు

ఆరు నెలలుగా అందని జీతాలు

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య మేరకు స్కావెంజర్ల జీతాలు చెల్లించాలని విద్యాశాఖ నిర్ణయించింది. 1 నుంచి 30 మంది విద్యార్థులు ఉంటే నెలకు రూ. 3వేలు, 31 నుంచి 100 మంది ఉంటే రూ.6వేలు, 101 నుంచి 250 మంది ఉంటే రూ.8వేలు, 251 నుంచి 500 వరకు స్టూడెంట్స్‌ ఉంటే రూ.12వేలు, 501 నుంచి 750 మంది వరకు రూ.15వేలు, 751 నుంచి ఎక్కువ మంది ఉంటే రూ. 20వేలు ఇవ్వాలని నిర్ణయించారు. విద్యార్థుల సంఖ్యను మేరకు స్కావెంజర్లను హెచ్‌ఎంలే నియమించుకోవాలి. స్టూడెంట్స్‌ సంఖ్యకు అనుగుణంగా నిర్దేశిత శ్లాబ్‌ ప్రకారం 10 నెలల పాటు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీకి నిధులు విడుదల చేస్తున్నారు.

ఎదురుచూపులు

చెల్లించేది తక్కువ జీతం. అదికూడా సమయానికి అందించకపోడంతో స్కావెంజర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్కావెంజర్లకు జీతాలు రాకపోవడంతో ఇల్లు గడవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత విద్యా సంవత్సరం నాలుగు నెలలు, ఈ విద్యా సంవత్సరం రెండు నెలల జీతాలు త్వరగా ఇప్పించాలని స్కావెంజర్లు కోరుతున్నారు.

వివిధ పనులకు మళ్లింపు

2025–26 విద్యా సంవత్సరంలో 10 నెలలకు సంబంధించి దాదాపు రూ.5కోట్లను స్కావెంజర్ల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 12 జనవరి 2026 వరకు మాత్రమే స్కావెంజర్లకు జీతాలు చెల్లించారు. స్కావెంజర్ల కోసం మంజూరైన డబ్బులను ప్రభుత్వ పాఠశాలలో వివిధ అభివృద్ధి పనులు నిర్వహించిన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు అందించారు. దాదాపు నాలుగు నెలలకు సంబంధించిన జీతాలు రూ.2కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు నిర్వహించిన అభివృద్ధి పనుల కోసం నిధుల సంబంధించిన ఫైల్‌ను చూడకుండానే గత డీఈఓ ఆమోదం తెలిపినట్లు తెలిసింది. విద్యాశాఖలో ఓ అధికారి పెట్టిన ఫైల్‌ను పరిశీలించకుండానే సంతకం పెట్టడంతోనే స్కావెంజర్లకు జీతాలు నిలిచిపోయాయని పలువురు ఆరోపిస్తున్నారు. దీని పై సంబంధిత డీఈఓకు షోకాజ్‌ నోటీసును రాష్ట్ర విద్యాశాఖ జారీ చేసినట్లు సమాచారం.

బడికి ఉపాధ్యాయులు, విద్యార్థులకంటే ముందే వచ్చి ప్రాంగణాన్ని, తరగతి గదులను ఊడ్చి శుభ్రం చేయడం మొదలు.. టాయిలెట్లు శుభ్రం చేసి సాయంత్రం అందరికంటే చివరిగా వెళ్లే స్కావెంజర్లు అష్టకష్టాలు పడుతున్నారు. స్వల్ప జీతాలైనా.. ఆరు నెలలుగా చెల్లించకపోవడంతో బతుకులు దుర్భరంగా మారాయి. జిల్లా వ్యాప్తంగా 1,021 ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లలో దాదాపు 2,100 మంది స్కావెంజర్లు విధులు నిర్వర్తిస్తున్నారు.

– సాక్షి, సిద్దిపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement