● విద్యార్థులకు ఉత్తమ బోధన అందించాలి ● కలెక్టర్ హైమావతి
సిద్దిపేటజోన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల తీరు మారాలని, విద్యార్థులకు ఉత్తమ బోధన అందించి మంచి ఫలితాలు తీసుకు రావాలని కలెక్టర్ హైమావతి పిలుపునిచ్చారు. బుధవారం టీటీసీ భవన్‌లో ప్రధానోపాధ్యాయులు, కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్లు, తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాళ్ళు, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ లక్ష్యానికి అనుగుణంగా జరగడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అన్ని మౌలిక వసతులు సక్రమంగా ఉన్నప్పటికీ ఉపాధ్యాయుల పని తీరు సరిగ్గా లేక పోవడం వల్లే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత మంది ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తూనే ప్రైవేట్ పాఠశాలల్లో పని చేస్తున్నారని, అలాంటి వారిని గుర్తించి విధుల నుంచి తొలగించాలని జిల్లా విద్యా శాఖాధికారిని ఆదేశించారు. టీచర్లు స్కూళ్లకు ఎంత మంది హాజరవుతున్నారో ఎఫ్‌ఆర్‌ఎస్ వివరాలను అందించాలన్నారు. మధ్యలో బడి మానేసిన విద్యార్థుల వద్దకు వెళ్లి తల్లిదండ్రుల సహకారంతో బడుల్లో చేర్పించాలన్నారు. టీచర్ల మధ్య పని విభజన జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ నెల 15 నాటికి యూనిఫామ్స్ వస్తాయని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి తదితరులు పాల్గొన్నారు.
మెనూ ప్రకారమే భోజనం పెట్టాలి
దుబ్బాక: మొక్కుబడిగా విద్యార్థులకు భోజనం పెడితే సహించేదిలేదని మెనూ ప్రకారం భోజనం పెట్టాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. బుధవారం పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురకుల పాఠశాల, కళాశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్న భోజన ప్రక్రియను పరిశీలించారు. మధ్యాహ్న భోజనంలోని బిర్యానీ రైస్, బాయిల్డ్ గుడ్డుకూర, ఆలు కుర్మ, రసం తనిఖీ చేశారు. బిర్యానీ రైస్ నాణ్యతగా లేదని ఆగ్రహించారు. రోజూ విద్యార్థుల హాజరు ప్రకారం ఫుడ్ కమిటీ సమక్షంలో కూరగాయలు, వంట సరకులు వంట సిబ్బందికి నాణ్యతగా అందించాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థులు జ్వరం, జలుబు బారినపడితే తగ్గేంతవరకు క్లోజ్ గా మానిటర్ చేయాలన్నారు.


