6 నుంచే
అమల్లోకి
యూరియా తరహాలోనే డీఏపీ,కాంప్లెక్స్ ఎరువుల సరఫరా
కేంద్ర ప్రభుత్వం ఎరువుల సరఫరాలో కొత్త విధానం అమల్లోకి తెచ్చింది. ఇకనుంచి రైతులు నేరుగా ఫర్టిలైజర్ దుకాణాలకు వెళ్లి ఎరువులు కొనుగోలు చేసే విధానానికి కేంద్రం స్వస్తి పలికింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న యూరియా తరహాలోనే కేంద్రం అన్ని ఎరువులను యాప్‌ద్వారానే సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంది.
దుబ్బాక: ఇకపై యూరియాతో పాటు డీఏపీ, అన్ని కాంప్లెక్స్ ఎరువులను రైతులు యాప్‌ద్వారానే బుకింగ్ చేసుకోవాలి. ఇందుకోసం కొత్తగా యాప్‌ను సైతం సిద్ధం చేసింది. కాగా, ఇప్పటికే యూరియా కోసం పడుతున్న కష్టాలు చాలదన్నట్టు మళ్లీ పుండుమీద కారం చల్లినట్లుగా అన్ని ఎరువులను యాప్‌తోనే సరఫరా చేయడంపై రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్‌తో అన్ని ఎరువులు
కేంద్రం రూపొందించిన ఎఫ్‌ఎఫ్‌ఎస్(ప్రేమ్ వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ యాప్) ద్వారా అన్ని కాంప్లెక్స్ ఎరువులను రైతులకు సరఫరా చేయనుంది. యూరియా సరఫరా తరహాలోనే అన్ని ఎరువులను ఈ కొత్త యాప్‌లోనే రైతులు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రైతులు తమ సెల్‌ఫోన్‌లో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని తమకు అవసరమున్న ఎరువులను బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం వ్యవసాయశాఖ అధికారులకు, రైతులకు అవగాహన కల్పించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
డీలర్లకు పూర్తయిన శిక్షణ
కొత్త ఎరువుల విధానంపై ఎరువుల డీలర్లకు జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో శిక్షణనిచ్చారు. ఎరు వులు ఫర్టిలైజర్ షాప్‌కు ఎలా వస్తాయి? యాప్‌లో రైతులు ఎలా బుకింగ్ చేసుకోవాలి? డీలర్లు రైతులకు ఏవిధంగా సరఫరా చేయాలి వంటి అంశాలపై అధికారులు అవగాహన కల్పించారు.
అన్నదాతల అయోమయం!
ఇప్పటికే యూరియా కోసం పడుతున్న కష్టాలు చాలదన్నట్లుగా కొత్తగా దుక్కి మందులు, కాంప్లెక్స్ ఎరువులకు సైతం యాప్ తీసుకరావడం పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. స్మార్ట్ ఫోన్ లేని రైతులు, చదువురాని రైతులు ఇప్పటికే యూరియా బుకింగ్ కోసం ఇబ్బందులు పడుతుండగా ఇక కొత్తగా అన్ని ఎరువులకు యాప్ బుకింగ్ పెట్టడం పట్ల రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటిలాగే ఎరువుల దుకాణాల ద్వారా ఎరువులు అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
కొత్త విధానం అమలులోకి తెచ్చిన కేంద్రం
ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ యాప్‌లో బుకింగ్
ఇప్పటికే ఎరువుల డీలర్లకు శిక్షణ
ఆందోళన చెందుతున్న రైతులు
కొత్తగా ఎరువుల సరఫరా విధానం(ఎఫ్‌ఎఫ్‌ఎస్ బుకింగ్ యాప్) ఈ నెల 6 నుంచే అమల్లోకి రానుంది. ఇందుకోసం వ్యవసాయశాఖ అధికారులు అంతా సిద్ధం చేసి ఉంచారు. యాప్‌ను సైతం ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంచనున్నారు.


