రెవెన్యూ విభాగంపై
సిద్దిపేటరూరల్: రెవెన్యూ విభాగంపై గౌరవం, నమ్మకం మరింత పెరిగేలా ప్రజలకు సేవ చేయాలని కలెక్టర్ హైమావతి రెవెన్యూ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో ఆర్డీఓలు, తహసీల్దార్ ఇతర రెవెన్యూ ముఖ్య అధికారులతో పలు అంశాలపైన అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్‌తో కలిసి కలెక్టర్ మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...ప్రజలకు ఎలాంటి సేవ అవసరమైనా ముందు సంప్రదించేది రెవెన్యూ అధికారులనేనని, మీపై నమ్మకంతో మీ వద్దకు వచ్చే ప్రజలకు పారదర్శకంగా సేవలందించి రెవెన్యూ విభాగంపై నమ్మకం, మంచి పేరు తీసుకురావాలన్నారు. జిల్లాలో భూ సేకరణకు సంబంధించి ఆయా డివిజన్ వారీగా టీజీఐఐసీ గుర్తించిన భూమిని ఆర్డీవోలు అత్యంత ప్రాధాన్యత తీసుకుని పూర్తి భూ సేకరణ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి చేర్యాల, కొమురవెల్లి, కొండపాక, గౌరవెల్లి ప్రాజెక్ట్ సంబంధించి కోహెడ, అక్కన్నపేట, హుస్నాబాద్ మండలంలో ఆర్డీవోలు కాలువల భూ సేకరణ తహసీల్దార్‌లతో కలిసి పూర్తి చేసేందుకు సర్వే నిర్వహించి అవార్డ్ పాస్ చేయాలన్నారు. జిల్లాలో నేషనల్ హైవేకు సంబంధించి బస్వాపూర్, హుస్నాబాద్ పట్టణంలో భూ సేకరణ వేగవంతం చేయాలని హుస్నాబాద్ ఆర్డీఓను, రీజనల్ రింగ్‌రోడ్ భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని గజ్వేల్ ఆర్డీఓను ఆదేశించారు. భూ సమస్యలు శాశ్వత పరిష్కారం చూపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చిందని, భూ భారతి రెవెన్యూ సదస్సులోని దరఖాస్తులు, సాదా బైనమా పెండింగ్ దరఖాస్తులు తహసీల్దార్, ఆర్డీఓలు పరిష్కరించి భూ భారతి రెవెన్యూ చట్టంపై అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ భూములు ఆయా మండలాల వారీగా నక్షా ప్రకారం సర్వే నిర్వహించి ఆక్రమణలకు గురికాకుండా పర్యవేక్షించాలని చెప్పారు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న రెండు పడకల గదుల వివరాలు సేకరించాలని, నిర్మాణం పూర్తయిన వాటిని అసలైన లబ్ధిదారులకు అందించేందుకు కృషి చేయాలన్నారు. జిల్లాలోని పలు మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతుందని, ఆ మండలాల్లో తహసీల్దార్ భవనం నిర్మాణం కొరకు అనువైన ప్రభుత్వ భూమిని ఎంపిక చేస్తే, ఇంజనీరింగ్ శాఖల సమన్వయంతో అంచనావేసి మంత్రుల చేతులమీదుగా శంకుస్థాపన చేయిస్తామన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ నాగరాజమ్మ, ఆర్డీవోలు సదానందం, చంద్రకళ, రామ్మూర్తి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ భవ్య,ఎస్‌డీసీ వరలక్ష్మి రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
రెవెన్యూ అధికారులతో సమీక్షలో కలెక్టర్ హైమావతి


