ఎఫ్‌ఆర్‌ఎస్‌ను దుర్వినియోగం చేస్తున్న టీచర్లు!!
హాజరు పక్కా..
ప్రభుత్వ ఉపాధ్యాయులు ఫేసియల్ రికగ్నైజేషన్ సిస్టమ్(ఎఫ్‌ఆర్‌ఎస్)లో హాజరు... క్లాస్‌లకు మాత్రం గైర్హాజరు అవుతున్నారు. పలువురు ఉపాధ్యాయులు పాఠశాలకు హాజరై బయట తమ సొంత పనులకు, ఫంక్షన్లకు, షాపింగ్‌లకు తిరుగుతున్నారు. ఇటీవల సిద్దిపేటలో మల్టీపర్పస్ పాఠశాలను కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేయగా...ఆరుగురు ఉపాధ్యాయులు ఎఫ్‌ఆర్‌ఎస్‌లో అటెండెన్స్ వేసుకుని ఎలాంటి డైరీ రాయకుండా..క్లాస్‌లు చెప్పకుండా బయట తిరుగుతున్నారని గుర్తించారు. ఆ ఆరుగురిని మంగళవారం సస్పెండ్ చేశారు. ఈ ఒక్కచోటనే కాదు..హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు ఒక్కటై పాఠశాలలకు డుమ్మా కొడుతూ... ఎఫ్‌ఆర్‌ఎస్‌ను పలువురు ఉపాధ్యాయులు దుర్వినియోగం చేస్తున్నట్లు తేలింది. –సాక్షి, సిద్దిపేట
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావిధానాన్ని మరింత పారదర్శకతతో అమలు చేసేందుకు ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఎఫ్‌ఆర్‌ఎస్‌ను ప్రత్యేక యాప్ ద్వారా అమలు చేస్తోంది. పాఠశాలకు చేరుకున్న తర్వాత ఉదయం ఇన్, సాయంత్రం అవుట్‌ను నమోదు చేయడం ద్వారా ఆ రోజు ఉపాధ్యాయులు అటెండెన్స్ నమోదవుతోంది. గతేడాది నుంచి ఉపాధ్యాయులకు ఎఫ్‌ఆర్‌ఎస్‌ను అమలు చేస్తోంది. జిల్లావ్యాప్తంగా 1,021 పాఠశాలలు ఉండగా అందులో 6,159 ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బంది ఉన్నారు.
హాజరు వేసుకుని బయటకు...
కొందరు ఉపాధ్యాయులు ఉదయం, సాయంత్రం సమయాల్లో ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా అటెండెన్స్ వేసుకుని బయటకు వెళ్తున్నారు. విధులకు డుమ్మా కొడుతున్నారు. మరికొందరు ఉదయం వస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో ఇంటికి భోజనానికి వెళ్లి మళ్లీ సాయంత్రం వస్తున్నారు. మరికొందరు పాఠశాలకు దూరంగా ఎఫ్‌ఆర్‌ఎస్ చేస్తున్నా సైతం హెచ్‌ఎంలు ఆమోదం తెలుపుతున్నారు.
ఆన్ డ్యూటీలు
కొందరు ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలు పాఠశాలకు రాకుండా డీఈఓ కార్యాలయంలో, బయట పాఠశాలకు సంబంధించిన పని ఉందని ఆన్‌డ్యూటీలు పెట్టుకుంటున్నారు. ఆన్‌డ్యూటీలు నేరుగా హెచ్‌ఎం ఆమోదం తెలుపుతుండటంతో హెచ్‌ఎం, టీచర్లు కుమ్మకై ్క మోసం చేస్తున్నారు. భార్యభర్తలిద్దరూ ఉపాధ్యాయులుగా ఒకే మండలంలో పనిచేస్తున్న వారు కొందరు బడి బయటనే 15 నిమిషాల ముందే ఎఫ్‌ఆర్‌ఎస్‌ను నమోదు చేసుకుంటున్నారు. భార్యను మరో పాఠశాల దగ్గర దింపి వచ్చి 15నిమిషాలు ఆలస్యంగా పాఠశాలకు వస్తున్నారు. అలాగే 15 నిమిషాల ముందే బయటకు వెళ్లి..15 నిమిషాలు ఆలస్యంగా ఎఫ్‌ఆర్‌ఎస్ నమోదు చేస్తున్నారు.
పర్యవేక్షణ కరువు
ఎఫ్‌ఆర్‌ఎస్‌ను అమలు చేస్తుండటంతో ఉపాధ్యాయులందరూ సక్రమంగా హాజరవుతున్నారన్న భావనలో విద్యాశాఖ అధికారులు పర్యవేక్షించడంలేదు. పలువురు హెచ్‌ఎంలు బడికి రాకుండానే ఆన్‌డ్యూటీని పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆన్‌డ్యూటీ ఆమోదం సైతం వారే చేసుకునే అవకాశమువంది. దీంతో పలువురు హెచ్‌ఎంలు పాఠశాలకు రాకుండా బయట తిరుగుతున్నారు. ఎప్పుడైనా అవసరమున్నప్పుడు ఉపయోగించే ఆన్‌డ్యూటీల ఆమోదాన్ని ఎంఈఓలకు ఇస్తే డుమ్మా కొట్టేవారిని నియంత్రించవచ్చు. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి ఎఫ్‌ఆర్‌ఎస్ ప్రక్షాళన చేసి డుమ్మాలు కొట్టే వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
యాప్‌లో ఇన్.. అవుట్ అటెండెన్స్... బయట తిరుగుతున్న ఉపాధ్యాయులు
ఆన్‌డ్యూటీల పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న హెచ్‌ఎంలు
ఎఫ్‌ఆర్‌ఎస్‌పై కరువైన పర్యవేక్షణ
హాజరు వేసుకుని
బయటకెళ్లొద్దు
ఎఫ్‌ఆర్‌ఎస్‌లో హాజరు నమోదు చేసుకున్న తర్వాత పాఠశాల నుంచి బయటకు వెళ్లవద్దు. వెళ్లాల్సి వస్తే టూర్ డైరీ రాసి వెళ్లాలి. ఉపాధ్యాయులందరూ ఉదయం, సాయంత్రం సమయాల్లో ఎఫ్‌ఆర్‌ఎస్‌లో హాజరు వేసుకోవాలి. ఉపాధ్యాయులు ఎఫ్‌ఆర్‌ఎస్‌లో హాజరు నమోదు చేసుకుని బయట తిరుగుతున్న విషయం నా దృష్టికి రాలేదు. అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
– రమేశ్, ఇన్‌చార్జి డీఈఓ


