సిద్దిపేటకమాన్: మద్యం తాగి వాహనం నడిపేవారు మానవ బాంబుతో సమానమని సిద్దిపేట అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్ అభివర్ణి ంచారు. సిద్దిపేట పట్టణం అంబేడ్కర్ చౌరస్తాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నివారణపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బస్టాండ్ చౌరస్తాలో రంగనాయకస్వామి ఫార్మసీ కళాశాల విద్యార్థినులు చేసిన ఫ్లాష్ మాబ్ ఆకట్టుకుంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం, మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరగడం వల్ల ప్రాణాలు కోల్పోవడం వంటివి యమధర్మరాజు వేషధారణలో విద్యార్థిని ప్రదర్శన ఆకట్టుకుంది. యువతకు పోలీసులు అవగాహన కల్పించడం వంటివి పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్ మాట్లాడుతూ..గంజాయి, డ్రగ్స్ వంటివి తీసుకున్నా, అక్రమ రవాణ చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. యువతపై డ్రగ్స్ కేసులు నమోదైతే వారి భవిష్యత్ నాశనమవుతుందని చెప్పారు. ఒక్క రోడ్డు ప్రమాదం కుటుంబం మొత్తాన్ని రోడ్డున పడేస్తుందన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లు నడిపే వారు తప్పకుండా సీట్ బెల్ట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. రోడ్డు భద్రత, మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన కల్పించిన విద్యార్థులను అభినందించారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, మాదక ద్రవ్యాల నివారణపై విద్యార్థుల చేత పోలీసు అధికారులు ప్రతిజ్ఞ చేయించారు.
మద్యం తాగి వాహనం నడిపేవారు మానవ బాంబుతో సమానం
అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్
సిద్దిపేట బస్టాండ్ చౌరస్తాలో ఫార్మసీ విద్యార్థుల ఫ్లాష్ మాబ్
రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నివారణపై అవగాహన


