డీఎంహెచ్‌ఓ డాక్టర్ ధనరాజ్
సిద్దిపేటకమాన్: డెంగీ, మలేరియా, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధుల నివారణ కోసం డ్రై డే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ధనరాజ్ స్పష్టం చేశారు. సిద్దిపేట పట్టణం అర్బన్ నాసార్‌పుర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పరిసర ప్రాంతాల్లో డాక్టర్ శ్రీకాంత్‌తో కలిసి డీఎంహెచ్‌ఓ మంగళవారం ఇంటింటికీ తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంట్లో వినియోగంలో లేని కూలర్లు, పూల కుండీలు, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు వంటివి దోమల వ్యాప్తికి అనుకూలమైన ప్రదేశాలని వీటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు, దోమలు, కీటకాల వల్ల వచ్చే వ్యాధుల గురించి అవగాహన కల్పించారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రంతోపాటు పరిసర ప్రాంతాలు పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్ యాదవ్, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
టీజీబీ రీజినల్ మేనేజర్ రాజయ్య
తొగుట(దుబ్బాక): ప్రతి ఒక్కరూ బీమా చేయించుకోవాలని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజినల్ మేనేజర్ రాజయ్య సూచించారు. స్థానిక బ్యాంకులో బాధిత కుటుంబీకులకు బీమా చెక్కులను మంగళవారం అందజేశారు. మండల కేంద్రానికి చెందిన సిలివేరి మల్లేశం గతేడాది ఈతచెట్టు పై నుంచి పడి మరణించారు. అలాగే చందాపూర్‌కు చెందిన చంద నర్సయ్య విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. ఈ క్రమంలో బాధిత కుటుంబాలకు రూ.20లక్షల చొప్పున బీమా చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ...బీమా చేయించుకుంటే కుటుంబాలకు ఆసరాగా నిలుస్తుందన్నారు. బ్యాంకులో ఖాతా కలిగిన ప్రతి ఒక్కరూ బీమా చేయించుకోవాలని కోరారు. బ్యాంకు ఖాతాదారులు బీమా చేయించుకునేలా అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో తొగుట బ్రాంచ్ మేనేజర్ జలంధర్, ఫీల్డ్ ఆఫీసర్ ప్రవీణ్, ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు శ్రీకాంత్, కృష్ణ, సీఎఫ్‌ఎల్ కౌన్సిలర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
విద్యారంగ
సమస్యలపై నిర్లక్ష్యం
టీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేట్
అధ్యక్షుడు తిరుపతిరెడ్డి
మిరుదొడ్డి(దుబ్బాక): ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని టీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జి.తిరుపతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీటీఎఫ్ మండల అధ్యక్షుడు అందె రామచంద్రం ఆధ్వర్యంలో మంగళవారం మండల పరిధిలోని కొండాపూర్, అందె, అల్వాల, చెప్యాల, మల్లుపల్లి, కాసులాబాద్, మిరుదొడ్డి, లక్ష్మీనగర్, ధర్మారం ఆరెపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. విద్యారంగ సమస్యలపై ఆరా తీశారు. అనంతరం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ ఉద్యోగులకు 2023 జూలై నుంచి రావాల్సిన పీఆర్సీని రాష్ట్ర ప్రభుత్వం నేటి వరకు అమలు చేయలేదన్నారు. ఉపాధ్యాయ ఉద్యోగులకు రావాల్సిన ఆరు పెండింగ్ డీఏలను విడుదల చేయాలని కోరారు. సిద్దిపేటలో ఆరుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. జూన్ ఒకటి నుంచి హెల్త్ కార్డులను అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం నేటి వరకు నిబంధనలు రూపొందించలేదని విమర్శించారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ర్యాకం మల్లేశం, జిల్లా కార్యదర్శి శివాజీ, జిల్లా కౌన్సిలర్ శ్రీకాంత్, విజయ్, మండల ప్రధాన కార్యదర్శి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.


