ఇటు చకచక | - | Sakshi
Sakshi News home page

ఇటు చకచక

Aug 1 2026 7:46 AM | Updated on Aug 1 2026 7:46 AM

పనులు ప్రారంభమయ్యేలా చూస్తాం:

అటు చతికిల..

● ప్రభుత్వ గ్రాంట్‌ల పనులు సాగని వైనం

● నగరాభివృద్ధి నిధులకు కరువైన మోక్షం

● యూఐడీఎఫ్‌ పనుల ప్రారంభంలో జాప్యం

● స్థానిక నిధులతో చేపట్టే పనుల్లో మాత్రం వేగం

● సమస్యలు తీరక జనం ఇక్కట్లు

గజ్వేల్‌: జిల్లాలో సిద్దిపేట తర్వాత రెండో ప్రధాన మున్సిపాలిటీ అయిన గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ నేడు విచిత్రమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. గతంలో ఆదర్శ మున్సిపాలిటీగా ఊదరగొట్టిన ఈ పట్టణం నేడు...ప్రభుత్వం నుంచి విడుదలైన నిధులను సకాలంలో వినియోగించుకోలేక చతికిల పడుతోంది. గతేడాది జూలై ఈ మున్సిపాలిటీకి యూఐడీఎఫ్‌(అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌) రూ.15.7కోట్లు వచ్చాయి. అదేవిధంగా నగరాభివృద్ధి కింద రూ.3కోట్లు వచ్చాయి. ఇదేవిధంగా సిద్దిపేట మున్సిపాలిటీకి కూడా ఈ నిధులు రాగా ప్రస్తుతం పనులు వేగంగా సాగుతున్నాయి. కానీ గజ్వేల్‌ –ప్రజ్ఞాపూర్‌ బల్దియాలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. వివిధ రకాల కారణాలను సాకుగా చూపి...పనులను ప్రారంభించడంలో అధికారులు ఆపసోపాలు పడుతున్నారు. ప్రస్తుతం యూఐడీఎఫ్‌ పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నా ఈ మున్సిపాలిటీకి ఏఈ లేకపోవడం, ఇతర రాజకీయ కారణాల సాకుతో పనులు ఇంకా పెండింగ్‌ పెట్టారు.

నగరాభివృద్ధి నిధులకు క్లియరెన్స్‌ ఎప్పుడు..?

మున్సిపాలిటీకి మంజూరైన రూ.3కోట్ల నగరాభివృద్ధి నిధుల విషయంలో జాప్యం నెలకొంది. ఈ పనులకు సంబంధించి టెండర్‌ను పూర్తిచేసి పనులను ప్రారంభించాల్సి ఉండగా...ఈ ప్రక్రియలో నిర్లక్ష్యం అలుముకుంది. ఈ పరిస్థితి వల్ల పట్టణంలో సమస్యలు తీరక జనం అవస్థలపాలవుతున్నారు. మున్సిపాలిటీలో అంతర్గత రోడ్లు అధ్వానంగా మారటం ఆందోళనకరంగా మారింది. చిరుజల్లులకే రోడ్లన్నీ చిత్తడిగా మారి నరకం చూపుతున్నాయి. ప్రధానంగా లక్ష్మీప్రసన్న కాలనీ, ప్రజ్ఞాపూర్‌, పట్టణంలోని ఇతర కొత్త కాలనీల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. ఏడాది కాలంగా ఊరిస్తున్న ఈ పనులను ప్రారంభించి ఉంటే ప్రస్తుత వానాకాలంలో కొంతమేర ఇక్కట్లు తప్పేవి. కానీ, ఇక్కడ పరిస్థితి భిన్నంగా మారింది. ఇవేకాకుండా పట్టణంలో ప్రధాన రోడ్డుపై వరద నియత్రణకు రూ.1.2కోట్లతో తూప్రాన్‌ రోడ్డు వైపున ఉన్న హెచ్‌పీ పెట్రోల్‌ బంకు వద్ద నిర్మించనున్న బ్రిడ్జి పనులు, ఇందిరాపార్క్‌ కూడలి, ఇతర కూడళ్ల సుందరీకరణకు రూ.1కోటి, చిల్డ్రన్స్‌ పార్కు సుందరీకరణకు రూ.1కోటి, పట్టణంలోని ప్రధాన రహదారులపై పెండింగ్‌లో ఉన్న సెంట్రల్‌ లైటింగ్‌ కోసం 1.5కోట్ల పనులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి.

స్థానిక పనులపైనే ఆసక్తి

ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను సకాలంలో వినియోగించుకోలేక చతికిల పడుతున్న మున్సిపల్‌ పాలకవర్గం, స్థానిక మున్సిపల్‌ నిధులతో చేపట్టే పనుల్లో మాత్రం ఆసక్తిని ప్రదర్శిస్తోంది. ఈ పనులపై సమగ్రమైన చర్చలు జరపకుండానే వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మున్సిపాలిటీ కార్యాలయ కింద భాగంలో అదనపు గదుల నిర్మాణం, ఇతర పనులే ఇందుకు నిదర్శనం. కానీ, కీలకమైన ప్రభుత్వ పనులను నిర్లక్ష్యం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలో దుస్థితి స్థానికంగా ఉన్న నిధులను వేగంగా వినియోగించుకుంటున్న గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ యంత్రాంగం...ప్రభుత్వ పథకాల పనులను పట్టాలెక్కించడంలో విఫలమవుతోంది. ఏడాది కిందట మంజూరైన పనులను ఇప్పటికీ ప్రారంభించలేకపోతున్నారు. మిగతా మున్సిపాలిటీల్లో పనులు చకచకా సాగుతుండగా, ఇక్కడ మాత్రం వివిధ కారణాలతో ముందుకుసాగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ఫోకస్‌ ఇది.

మున్సిపాలిటీలో యూఐడీఎఫ్‌ పనులు త్వరలోనే ప్రారంభమయ్యేలా చూస్తాం. రూ.3కోట్లతో చేపట్టాల్సిన నగరాభివృద్ధి పనులను టెండర్‌ పూర్తి చేయించి పనులు ప్రారంభమయ్యేలా ప్రయత్నిస్తాం. పట్టణ ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే మా లక్ష్యం.

–గణేశ్‌రెడ్డి,

గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ కమిషనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement