83 మంది చిన్నారులకు విముక్తి | - | Sakshi
Sakshi News home page

83 మంది చిన్నారులకు విముక్తి

Aug 1 2026 7:46 AM | Updated on Aug 1 2026 7:46 AM

83 మంది చిన్నారులకు విముక్తి 2న నశా ముక్త ప్రతిజ్ఞ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలే ఆడపిల్లలు అప్రమత్తంగా ఉండాలి

సీపీ రష్మీ పెరుమాళ్‌ వెల్లడి

సిద్దిపేటకమాన్‌: బాలకార్మికులను గుర్తించి 83 మంది చిన్నారులకు పని నుంచి విముక్తి కల్పించినట్లు సీపీ రష్మీపెరుమాళ్‌ వెల్లడించారు. సిద్దిపేట పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమాన్ని జూలై 1నుంచి 31 వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పోలీసు, మహిళా శిశు సంక్షేమ శాఖ, కార్మిక, బాలల పరిరక్షణ యూనిట్‌ సమన్వయంతో పలు హోటళ్లు, దాబాలు, పరిశ్రమలు, ఇటుక బట్టీలు, వ్యాపార సంస్థల్లో తనిఖీలు నిర్వహించి 83మంది బాల కార్మికులను గుర్తించినట్లు తెలిపారు. వీరికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, కౌన్సిలింగ్‌ అందించి పునరావాసానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. బాల కార్మికులను పనిలో పెట్టుకున్న 17మంది యజమానులపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.

వర్చువల్‌గా ప్రధాని మోదీ సందేశం

సిద్దిపేటజోన్‌: ‘నశా ముక్త యువ ఫర్‌ వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ అభియాన్‌’లో భాగంగా ఈనెల 2న నశా ముక్త ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా యువజన అధికారి రంజిత్‌రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. యువజన వ్యవహారాల, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ యువతతో వర్చువల్‌గా మాట్లాడనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని వర్గల్‌ కావేరి యూనివర్సిటీలో యువతతో ప్రధాని సంభాషించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 10 వేల కేంద్రాల్లో కోటిమంది యువత, మైభారత్‌ వలంటీర్లు, యువజన సంఘాలు, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు, విశ్వ విద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించి, విజేతలను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయనున్నట్లు వివరించారు. ఆగస్టు14న ఢిల్లీలో జాతీయ నశా ముక్త యువ సదస్సులో ఉత్తమ ప్రతిభ చూపిన వారికి సన్మానం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

మద్దూరు(హుస్నాబాద్‌): విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని పశుసంవర్థక శాఖ జిల్లా అధికారి గోపాలకృష్ణమూర్తి స్పష్టం చేశారు. మండల కేంద్రంలోని పశువైద్య కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి అందుబాటులో ఉన్న మందులు, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...నిత్యం రైతులకు అందుబాటులో ఉంటూ పశువులకు మెరుగైన వైద్యాన్ని అందించాలన్నారు. రైతులు వ్యవసాయంతోపాటు పశుపోషణపై దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వం చేపట్టే వివిధ కార్యక్రమాలను విజయవంతం చేయాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి పశువైద్యాధికారి సాజిద్‌ అలీ,సిబ్బంది ఉన్నారు.

జెండర్‌ స్పెషలిస్ట్‌ లావణ్య

గజ్వేల్‌రూరల్‌: ఆడపిల్లలు అప్రమత్తంగా ఉండాలని జెండర్‌ స్పెషలిస్ట్‌ లావణ్య పేర్కొన్నారు. ‘బేటీ బచావో–బేటీ పడావో’కార్యక్రమంలో భాగంగా జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో ప్రపంచ మానవ అక్రమ రవాణ వ్యతిరేక దినోత్సవాన్ని శుక్రవారం గజ్వేల్‌ పట్టణంలోని బాలికల ఎడ్యుకేషన్‌ హబ్‌లోగల పీఎంశ్రీ తెలంగాణ మోడల్‌ స్కూల్‌లో పాఠశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వన్నీసా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లావణ్య మాట్లాడుతూ...మానవ అక్రమ రవాణాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతీ ఒక్కరిని భాగస్వాములను చేయడానికి ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఆడపిల్లలు, మహిళలను మోసం చేయడం, బెదిరించడం, బలవంతం లేదా మాయమాటలతో మోసం చేయడం, అక్రమ రవాణా చేసేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement